దాదాపు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పినట్టే
లైట్ తీసుకుంటున్న హస్తం
భవిష్యత్తులో దెబ్బ ఖాయం అంటున్న విశ్లేషకులు
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ జీవన్ రెడ్డి. తాను ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ పార్టీపై ఆయన అలక వహించారు. అసంతృప్తి ప్రదర్శించారు. గులాబీ పార్టీలో చేరేందుకు సిద్ధపడ్డారు. అయితే ఆయన విషయంలో కాంగ్రెస్ పార్టీ లైట్ తీసుకుంది. వెళ్ళిపోతే వెళ్ళిపొండి అన్నట్టు వదిలేసింది. ఒకరిద్దరి నేతలతో రాయబారం పంపించింది. కానీ అది వర్క్ అవుట్ అయ్యేలా లేదు. అయితే ఇప్పటికిప్పుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి తీసుకొచ్చే ఇబ్బందులు ఏమీ లేవు కానీ.. వచ్చే ఎన్నికల నాటికి జీవన్ రెడ్డి తప్పకుండా ప్రభావం చూపగలరు. గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విషయంలో ఇదే మాదిరిగా లైట్ తీసుకుని దెబ్బతింది గులాబీ పార్టీ. ఇప్పుడు జీవన్ రెడ్డి నుంచి కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదమే ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తప్పకుండా జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దెబ్బతీస్తారన్న వారు ఎక్కువ.
గులాబీని దెబ్బ కొట్టిన పొంగులేటి..
గతంలో ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చాలా తక్కువ చేసి చూసింది గులాబీ పార్టీ. ఆయనపై నేతలు రాంగ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడంతో బిఆర్ఎస్ నాయకత్వం తక్కువగా అంచనా వేసింది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయాక ఒక్కో నేత ఆయనను అనుసరించారు. పొంగులేటి వెళ్ళిపోయిన వెంటనే తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు వంటి నేతలు కూడా అనుసరించారు. ఇప్పుడు జీవన్ రెడ్డి వెళ్లిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఓ భారీ టీం ఎన్నికలకు ముందు వెళ్లడం ఖాయమని తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా పై జీవన్ రెడ్డి ప్రభావం ఉంటుంది. కానీ 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలామంది నేతలు పార్టీ నుంచి బయటపడతారని కాంగ్రెస్లో కూడా ఒక వాదన ఉంది.
జవసత్వాలు నింపిన జీవన్ రెడ్డి..
ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడంలో జీవన్ రెడ్డి పాత్ర కూడా ఉంది. 2014 ఎన్నికల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గులాబీ పార్టీ హవా ఉండేది. 2018 ఎన్నికల్లో అయితే వారు వన్ సైడ్ అన్నట్టు గులాబీ పార్టీ వైపు లీడ్ కనిపించింది. ఆ సమయంలో ఆ జిల్లా నుంచి కేవలం జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు అంటే ఆయన ఎంతటి బలవంతుడో అర్థం అవుతుంది. 2023 ఎన్నికలకు ముందు కరీంనగర్ తో పాటు చుట్టుపక్కల జిల్లాల్లో కాంగ్రెస్ ఆచూకీ లేదు. అటువంటి సమయంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీకి ఊపిరి పోసింది జీవన్ రెడ్డి. అటువంటి జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లైట్ తీసుకుంటుంది. కానీ ఆయన భవిష్యత్తులో పెద్ద దెబ్బ కొట్టబోతున్నారు. దానికి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మూల్యం చెల్లించుకుంటుందని టాక్ ఉంది పొలిటికల్ వర్గాల్లో.
ప్రభావం ఎక్కువే..
అయితే ఏ పార్టీ నుంచి అయినా ఒక నేత బయటకు వెళ్ళినప్పుడు ఆ పార్టీకి డ్యామేజ్ జరగడం జరుగుతూ ఉంటుంది. అది సాధారణమైన చర్య కూడా. కానీ జీవన్ రెడ్డి దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్న సంబంధాలను తెంచుకొని వెళ్తున్నారు అంటే.. ఆయన పక్క వ్యూహంతోనే ఉన్నట్టు అర్థమవుతుంది. అయితే సరైన సమయం చూసి ఆయన సైతం దెబ్బ కొడతారని అనుచర వర్గం చెబుతోంది. కానీ కాంగ్రెస్ మాత్రం చాలా లైట్ తీసుకుంటుంది జీవన్ రెడ్డిని. పొంగులేటి మాదిరిగానే జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం ఖాయమని పొలిటికల్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి మున్ముందు జీవన్ రెడ్డి ఎలా రివెంజ్ తీసుకుంటారో చూడాలి.
