
ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని డిజిటల్ ఆర్థిక ఆస్తులను పొందడం ఇప్పటికీ పెద్ద సవాలుగానే మారుతోంది. ముఖ్యంగా UPI వాలెట్లు, డిజిటల్ వాలెట్లు, క్రిప్టో కరెన్సీల విషయంలో స్పష్టమైన నిబంధనలు, సులభమైన ప్రక్రియలు లేకపోవడం కుటుంబ సభ్యులకు ఇబ్బందిగా మారుతోంది. సాంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థతో పోలిస్తే డిజిటల్ ఫైనాన్స్ రంగంలో నామినేషన్, వారసత్వ వ్యవహారాలు ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బ్యాంక్ ఖాతాల విషయంలో నామినీ నమోదు చేసి ఉంటే, ఖాతాదారుడు మరణించిన తర్వాత బ్యాలెన్స్ బదిలీ ప్రక్రియ కొంత సులభంగా పూర్తవుతుంది. అదే విధంగా బ్యాంక్ ఖాతాతో లింక్ అయిన UPI అకౌంట్లలో ఉన్న మొత్తాన్ని కూడా నామినీకి బదిలీ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకు సంబంధిత బ్యాంక్ నిబంధనలు, డాక్యుమెంటేషన్ ప్రక్రియను తప్పనిసరిగా పూర్తి చేయాల్సి ఉంటుంది.
డిజిటల్ వాలెట్ల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా వాలెట్ సేవల సంస్థలు ఇప్పటికీ నామినేషన్ సదుపాయాన్ని అందించడంలేదు. ఫలితంగా ఖాతాదారుడు మరణించిన తర్వాత ఆ వాలెట్లలో ఉన్న డబ్బును కుటుంబ సభ్యులు నేరుగా యాక్సెస్ చేయలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇలాంటి సందర్భాల్లో మరణ ధ్రువీకరణ పత్రం, చట్టపరమైన వారసత్వ సర్టిఫికెట్ లేదా కోర్టు ఉత్తర్వులు అవసరం అవుతాయి. ఈ ప్రక్రియ పూర్తయ్యేలోగా చాలా సమయం గడిచిపోతుండటంతో పాటు, కొన్నిసార్లు మొత్తాన్ని పొందడం కూడా కష్టమవుతోంది.
క్రిప్టో కరెన్సీల విషయంలో అయితే ప్రమాదం మరింత ఎక్కువగా ఉంది. క్రిప్టో ఆస్తులు పూర్తిగా ప్రైవేట్ కీలు, లాగిన్ వివరాలపై ఆధారపడి ఉంటాయి. ఖాతాదారుడు మరణించి, అతని ప్రైవేట్ కీ లేదా పాస్‌వర్డ్ వివరాలు ఎవరికీ తెలియకపోతే, ఆ క్రిప్టో ఆస్తులు శాశ్వతంగా కోల్పోయే అవకాశం ఉంటుంది. ఎలాంటి బ్యాంక్ లేదా సంస్థను సంప్రదించి తిరిగి పొందే అవకాశం ఇక్కడ ఉండదు. అందుకే క్రిప్టో పెట్టుబడిదారులు ముందుగానే తమ డిజిటల్ వారసత్వంపై ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
డిజిటల్ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరిస్తున్న ఈ సమయంలో మరణానంతరం ఆస్తుల బదిలీకి సంబంధించి స్పష్టమైన పాలసీలు, నామినేషన్ సదుపాయాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. లేకపోతే, శ్రమతో సంపాదించిన డిజిటల్ ఆస్తులు కుటుంబ సభ్యులకు అందకుండా పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ALSO READ: Shocking: ప్రెగ్నెంట్ చేస్తే రూ.10 లక్షలు!





