– తెలంగాణ టార్గెట్ 3 ట్రిలియన్ డాలర్లు.. రేవంత్ మాస్టర్ ప్లాన్ ఇదే!
– 2034 నాటికి లక్ష కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ
– 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు చేరాలన్న లక్ష్యం
– హైదరాబాద్ నుంచి పల్లెల వరకు మూడు ప్రత్యేక అభివృద్ధి జోన్లు
– దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 5 నుంచి 10 శాతానికి పెంచడమే ధ్యేయం
క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:-
హైదరాబాద్లో ఐటీ కంపెనీలు.. నగర శివార్లలో పరిశ్రమలు.. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత రంగాలు. ఇలా తెలంగాణలోని ఒక్కో ప్రాంతానికి ఒక్కో అభివృద్ధి బాధ్యత అప్పగిస్తూ రాష్ట్ర ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రణాళికలను ప్రకటించారు.
2034కి ఒక ట్రిలియన్.. 2047కి మూడు ట్రిలియన్లు
హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన సమాఖ్య బిజినెస్ సమ్మిట్-2026ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. మరో కార్యక్రమంలో గ్లోబల్ పెట్టుబడుల ప్రాధాన్యాన్ని వివరిస్తూ, తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడులకు ఆకర్షణీయమైన కేంద్రంగా మార్చాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్లడించారు. 2034 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక ట్రిలియన్ డాలర్ల స్థాయికి, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో తెలంగాణ వాటా ఐదు శాతంగా ఉందని, దాన్ని పది శాతానికి పెంచేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
మూడు జోన్లు.. మూడు రకాల అభివృద్ధి
రాష్ట్రంలోని ప్రాంతాల స్వభావం, అవకాశాలను బట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు క్యూర్, ప్యూర్, రేర్ పేర్లతో మూడు జోన్లను రూపొందించనున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు.
క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ): ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని ప్రాంతాన్ని ఐటీ, సేవారంగం, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలకు ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయనున్నారు.
ప్యూర్ (పెరీ-అర్బన్ రీజియన్ ఎకానమీ): ఔటర్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ మధ్యనున్న ప్రాంతాల్లో తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, రవాణా-సరఫరా వ్యవస్థలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.
రేర్ (రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ): గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఆహార శుద్ధి పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత వ్యాపారాలు, ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి పెట్టనున్నారు.
రాజకీయాల కంటే అభివృద్ధికే ప్రాధాన్యం
2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ ప్రణాళికలు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ లక్ష్యాన్ని సాధించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సహకారం అవసరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలకు ప్రాధాన్యం ఉండాలని, అభివృద్ధి విషయంలో అందరూ కలిసి పనిచేయాలని అన్నారు.
పెట్టుబడిదారులకు ఆహ్వానం
దాదాపు 400 ఏళ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ నగరం విభిన్న సంస్కృతులకు నిలయంగా ఎదిగిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. చార్మినార్ నుంచి హైటెక్ సిటీ వరకు నగరం సాధించిన మార్పులను ప్రస్తావిస్తూ, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.స్థానిక వ్యాపారవేత్తలు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. పారిశ్రామిక రంగంలో యువత, మహిళల భాగస్వామ్యం పెరగాలని, మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని సూచించారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల సదస్సు ప్రారంభ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
