
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:-బయటకు గౌరవం, లోపల నియంత్రణ లోపం.. ఈ విరుద్ధతే నేటి సమాజంలో పదేపదే బయటపడుతోంది. ముసుగేసుకున్న పెద్దమనుషులు, తెర వెనక మాత్రం మదనకామరాజులుగా మారుతున్న దృశ్యాలు సోషల్ మీడియా యుగంలో తరచుగా దర్శనమిస్తున్నాయి. వైరల్ కావడం ఈ కాలంలో కొందరికి వరంగా మారింది. ఒక్క వీడియోతో రాత్రికి రాత్రే గుర్తింపు, క్రేజ్, ప్రభావం పెరుగుతుంది. కానీ అదే సోషల్ మీడియా మరో భయంకరమైన నిజాన్ని కూడా చూపిస్తోంది. వైరల్ కాకూడని వీడియోలు ఒక్కసారి బయటికి వస్తే చాలు, ఏళ్ల తరబడి నిర్మించుకున్న పేరు, పరువు, కెరీర్ అన్నీ క్షణాల్లో కూలిపోతున్నాయి. ఒకప్పుడు గౌరవంతో పలకరించినవారే, మరుసటి రోజే విమర్శకులుగా మారిపోతున్నారు.
Read also : మాతృత్వానికే మచ్చ.. ప్రియుడితో శృంగారం చేస్తుండగా చూశాడని కొడుకుని చంపిన తల్లి
ఈ వాస్తవాన్ని ఇప్పటికే అనేక ఘటనలు రుజువు చేశాయి. అత్యున్నత స్థాయి ఉద్యోగులు, రాజకీయాల్లో ఉద్ధండులుగా పేరొందిన నేతలు, ఉన్నత హోదాల్లో ఉన్న అధికారులు వారి వ్యక్తిగత జీవితంలోని ఒక బలహీన క్షణం బయటపడగానే రాజకీయ జీవితం, ఉద్యోగ భవిష్యత్తు ముగిసిన సందర్భాలు ఎన్నో. ఇది వ్యక్తిగత విషయం అన్న వాదన, డిజిటల్ యుగంలో ఎంత బలహీనమైందో ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఇలాంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన చోట, కొందరు అదే తప్పును మళ్లీ చేస్తున్నారు. అధికార హోదా, డబ్బు, పేరు ఉన్నాయనే భ్రమలో నియంత్రణ కోల్పోతున్నారు. ప్రజల ముందు నీతులు చెప్పే వారు, తెర వెనక తప్పు దారిలో నడిచినప్పుడు దాని ప్రభావం వ్యక్తిగత జీవితానికే పరిమితం కాదని, సమాజమంతా చూస్తుందన్న సత్యాన్ని విస్మరిస్తున్నారు. డిజిటల్ యుగంలో గోప్యత ఒక సున్నితమైన భావనగా మారింది. ప్రతి ఫోన్ ఒక కెమెరా, ప్రతి క్లిక్ ఒక సాక్ష్యం. క్లౌడ్‌లో భద్రపడ్డ దృశ్యాలు కాలంతో మాయం కావు. క్షణిక సుఖం కోసం తీసుకున్న ఒక తప్పు నిర్ణయం, జీవితాంతం వెంటాడే ముద్రగా మారుతోంది.
“క్రైమ్ మిర్రర్ అభిప్రాయం స్పష్టం”. పదవి ఎంత ఎత్తయినా, వ్యక్తిగత బాధ్యత అంతకంటే ఎత్తుగా ఉండాలి. ప్రజల విశ్వాసం సంపాదించడం అత్యంత కష్టం.., కోల్పోవడం మాత్రం క్షణకాలం. సోషల్ మీడియా శబ్దం తగ్గేలోపు కెరీర్ ముగిసిపోతుందన్న నిజం, సమాజానికి ఇచ్చే హెచ్చరిక ఇదే.





