క్రైమ్ మిర్రర్, తమిళనాడు: తమిళనాడు ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ ఏడాది అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ అధికార డిఎంకె కూటమి బలంగా ఉంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి అక్కడ బలం పెంచుకుంది. అయితే అవి ఓట్ల పరంగా మాత్రమే. సీట్ల పరంగా డీఎంకే కూటమి ఏకపక్ష విజయం సాధించింది. అయితే పెరిగిన ఓటు షేరింగ్‌తో బిజెపి గట్టి ప్రయత్నమే చేస్తోంది ఈ అసెంబ్లీ ఎన్నికలకు. కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా దక్కించుకుంటే చాలు అన్నట్టు ఉంది ఆ పార్టీ పరిస్థితి. అదే సమయంలో కలిసి వచ్చిన పార్టీలతో పొత్తు పెట్టుకుంటే గణనీయమైన సీట్లు సొంతం చేసుకోవచ్చన్న ఆలోచనతో ఉంది. కానీ బిజెపితో కలిసేందుకు ఏ పార్టీ కూడా ముందుకు రావడం లేదు. దానికి కారణం బిజెపి పై హిందుత్వ ముద్ర ఉంది. తమిళనాడులో ద్రవిడ సిద్ధాంతం బలంగా ఉంటుంది. ఆ కారణంతోనే బిజెపితో చెలిమి చేసేందుకు ఎవరు ముందుకు రావడం లేదు.
మారుతున్న వైఖరి..
అయితే అభివృద్ధితోపాటు హిందుత్వ వాదం పై అక్కడ హిందువులు మొగ్గు చూపుతున్నారు. ప్రతి మతం తన ప్రభావం చూపుతోంది. అటువంటిప్పుడు హిందుత్వవాదం ఎందుకు చూడకూడదు అన్నది హిందూ సమాజం నుంచి వస్తున్న కొత్త ఆలోచన. ద్రవిడ సిద్ధాంతం మంచిదే. కానీ అది హిందుత్వానికి వ్యతిరేకంగా ఉండకూడదు అని అక్కడ ఆలోచన మొదలైంది. ఇటువంటి సమయంలో కలిసి వచ్చిన మిత్రులతో ముందుకు వెళితే మంచి ఫలితాలు వస్తాయని భారతీయ జనతా పార్టీ ఆశిస్తోంది. కానీ మిగతా రాజకీయ పార్టీల నుంచి ఆ స్థాయిలో స్పందన రావడం లేదు. దీంతో బీజేపీకి సరైన మిత్రపక్షం లేదు. అన్నా డీఎంకే ఉంది కానీ అంతకుమించి అన్నట్టు ఆలోచన చేస్తోంది బిజెపి.
ఓట్లు చీలిపోకుండా..
బలమైన అధికార డిఎంకె కూటమిని ఢీ కొట్టాలంటే ఓట్లు చీలిపోకూడదు. అయితే అక్కడ సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఓట్లు చీలుస్తుందన్న అనుమానం ఉంది. అయితే ఈ చీలిక విపక్షాలకి ఇబ్బంది. విజయ్ ఒంటరిగా పోటీ చేయాలని కోరుకుంటుంది అధికార డిఎంకె. మరోవైపు బిజెపితో చేతులు కలిపేందుకు విజయ్ ముందుకు రావడం లేదు. బిజెపి చేయని ప్రయత్నం అంటూ లేదు. చివరకు తొక్కిసలాట ఘటనను అడ్డం పెట్టుకొని విజయ్ ను దారిలోకి తెచ్చేందుకు కేంద్రంలో ఉన్న బిజెపి చేయని ప్రయత్నం అంటూ లేదు. కానీ విజయ్ మాత్రం లొంగడం లేదు. భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపేందుకు ఇష్టపడడం లేదు. జాతీయస్థాయిలో ఎన్డీఏకు దగ్గర అయ్యేందుకు ఇష్టం ఉన్నా.. ద్రవిడ సిద్ధాంతం మూలంగా తమిళనాడులో బిజెపితో చేతులు కలిపేందుకు మాత్రం ఇష్టపడడం లేదు.
పవన్ ప్రయోగం..
అయితే తమిళనాడులో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రయోగిస్తున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ తమిళ నటుడు విజయ్ తో చర్చలు జరుపుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. అందులో కొంతవరకు సానుకూల ఫలితాలు వచ్చినట్లు సమాచారం. ఏపీలో తనకు ఎదురైన పరిస్థితులు.. బిజెపితో కలిసిన తర్వాత వచ్చిన ఫలితాలను పవన్ కళ్యాణ్ విజయ్ కు వివరించినట్లు సమాచారం. దీంతో ఆయన ఎన్డీఏలో చేరేందుకు సిద్ధపడినట్లు ప్రచారం నడుస్తోంది. కొద్ది రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
