
హైదరాబాద్ మహా నగరం మరోసారి తడిసి ముద్దయ్యింది. రాత్రంతా భారీ వర్షాలతో అతలాకుతలమైంది. తెల్లవారు జాము 4 గంటలవరకు నగరం మొత్తం కుండపోత వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. మౌలాలీ, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, తార్నాక, సికింద్రాబాద్, కుత్బుల్లాపూర్, కొంపల్లి, జీడిమెట్ల, కూకట్‌పల్లి, నిజాంపేట్, మియాపూర్, అల్వాల్, శామీర్‌పేట, మల్కాజ్‌గిరి, మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మెహిదీపట్నం, లక్డీకాపూల్ తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది. ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది. రాత్రి వర్షం కావడం, పంద్రాగస్టు సెలవుతో నగరవాసులంతా ఇళ్లలోనే ఉండటంతో వాన కష్టాలు తప్పాయి.
అటు సంగారెడ్డి, మెదక్ జిల్లాలో కుండపోత వాన కురిసింది. గంటల వ్యవధిలో భారీ వర్షం దంచికొట్టింది. రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. సంగారెడ్డి జిల్లా పుల్కల్‌లో 8.8, నల్లవల్లి 6.4, చౌటకుర్, అమీన్ పూర్ 6.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. మెదక్ జిల్లా నర్సాపూర్ 7.6, శివంపేట 6.5, కాళ్లకల్, చిన్న శంకరంపేట 3.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది.
తెలంగాణలో వర్షాలు భారీగా పడుతున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో అటు ఏపీలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాలో ఇవాళ భారీ వర్షాలు కురుస్తాయని APSDMA వెళ్లడించింది. ఇటు తెలంగాణలోని నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అలాగే ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వరంగల్, వికారాబాద్, జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.