New Vande Mataram Guidelines: జాతీయ గేయం వందేమాతరం ఆలాపనపై కొత్త నిబంధనలను కేంద్రం అమల్లోకి తెచ్చింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో జాతీయ గీతం జనగణమన కంటే ముందుగా జాతీయ గేయం వందేమాతరం అలపించాలి. అధికారిక కార్యక్రమాలు, వేడుకల్లో తొలుత 3 నిమిషాల 10 సెకన్ల పాటు వందేమాతరం 6 చరణాలను ఆలపించాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ప్రకటించిన వందేమాతరం కొత్త ప్రోటోకాల్ అమల్లోకి వచ్చింది.
వందేమాతరం ఎప్పుడు పాడాలి?
ఈ నిబంధనల ప్రకారం, వందేమాతరం ఆలపిస్తున్న సమయంలో ప్రతి ఒక్కరూ లేచి నిలబడాలి. పౌర పురస్కారాలు, రాష్ట్రపతి, గవర్నర్లు పాల్గొనే అన్ని కార్యక్రమాల్లోనూ వందేమాతరం ఆలపించాలి. సినిమా హాళ్లలో దీన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. జాతీయ గీతం, జాతీయ గేయం ఆలపించేటప్పుడు అంతరాయం కలిగిస్తే బాధ్యులకు మూడేళ్ల వరకూ జైలుశిక్ష పడుతుంది. స్కూళ్ల కార్యక్రమాలు తప్పకుండా వందేమాతరం కార్యక్రమంతో మొదలు కావాలి. ఇందుకోసం పాఠశాలల నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయాలి. కాగా, ప్రత్యేక కార్యక్రమాలు, వేడకల్లో వందేమాతరం ఆలాపన చేయాలని అనుకుంటే తగిన ఆడియో సిస్టమ్‌ను సమకూర్చుకోవాలి. అవసరమైతే గేయం ఆలాపనకు వీలుగా ఆరు చరణాలతో కూడిన కరపత్రాలను కార్యక్రమానికి హాజరైన వారికి పంపిణీ చేయవచ్చు.
వందేమాతర గేయం 150 వసంతాల వేడుకలు
దేశభక్తి, మాతృభూమిపై ప్రేమతో మర్యాదపూర్వకంగా సముచితమైన పద్ధతిలో ఏ కార్యక్రమంలో నైనా వందేమాతరం ఆలపించవచ్చని కేంద్రం తెలిపింది. వందేమాతర గేయం 150 వసంతాల వేడుకలను కేంద్ర నిర్వహిస్తున్న వేళ ఈ మార్గదర్శకాలను విడుదల చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.









