
మిర్యాలగూడ, ( క్రైమ్ మిర్రర్ ) : మిర్యాలగూడ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో ఊయల కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మిర్యాలగూడ ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆఫీసర్ రేఖల మమత మాట్లాడుతూ తల్లిదండ్రులకు భారంగా పెంచ లేని స్థితి అనిపించిన శిశువులను అనారోగ్యం కారణంగా జన్మించిన శిశువులను అలాగే శిశువులకు జన్మనిచ్చి సమాజానికి భయపడి జన్మనిచ్చిన శిశువులను ఎక్కడో చెత్తకుప్పలో కాలువల్లోనూ పడేస్తూ ఎన్నో శిశు మరణాలకు కారణాలు అవుతున్న సమయంలో అటువంటి అనర్ధాలు జరగకుండా ఆపడమే ఊయల కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.
శిశువులను ఉయ్యాలలో వేయడం వలన శిశువులను జిల్లా పరిధిలో గల శిశుగృహకు పంపించి శిశువు ఆలనా పాలనను చూసుకోవడం జరుగుతున్నదన్నారు. అలాగే ఎవరికైనా పిల్లలు దత్తత కావాలనుకుంటే తల్లిదండ్రులకు లీగల్ గా చట్టపరమైన దత్తత ఇవ్వడం జరుగుతుందన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసేలా అందరూ కృషిచేయాలని వివరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రారంభించినట్టు ఆమె తెలిపారు.
కార్యక్రమంలో ఏరియా హాస్పటల్ సూపరింటెండెంట్ డాక్టర్ సమరత్ శ్రీనివాస్, చైల్డ్ ప్రొటక్షన్ కమిటీ చైర్మెన్ చింత కృష్ణయ్య, లీగల్ అడ్వైజర్ వెంకన్న, సోషల్ వర్కర్ రమణి, శిశు గృహ మేనేజర్ దుర్గా, సూపర్ వైజర్స్ ఎం.లీలాకుమారి కె.నాగమణి, నజీమబేగం మహమ్మద్ సిహెచ్.పద్మ అంగన్వాడి టీచర్స్ పాల్గొన్నారు.