అంతర్జాతీయం

Oil Reserve: అబూదాబిలో మనకూ చమురు నిల్వలు, ఇకపై ఉత్పత్తి రంగంలోనూ భారత్!

అబూదాబిలో భారతీయ కంపెనీ ఉర్జా భారత్‌ భారీ చమురు నిక్షేపాలను గుర్తించింది. ఇకపై భారత్ చమురు ఉత్పత్తిలో కీలక పాత్ర పోషించబోతోంది.

యూఏఈ రాజధాని అబూదాబిలో భారతీయ కంపెనీ ఉర్జా భారత్‌ తాజాగా పెద్ద ఎత్తున చమురు నిక్షేపాలను కనిపెట్టింది. ఈ నేపథ్యంలో చమురు రంగానికి సంబంధించి భారత్‌ మరో కీలక మైలురాయికి చేరినట్లు అయ్యింది. ఇప్పటి వరకు చమురు దిగుమతిదారుగానే ఉన్న భారత్‌.. చమురు ఉత్పత్తిలో కీలకమైన పాత్రధారిగా మారబోతోంది. భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ అనుబంధ సంస్థ భారత్‌ పెట్రో రిసోర్సెస్‌, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఏర్పాటు చేసిన సంస్థ ఉర్జా భారత్‌. ఈ సంస్థ అబూదాబిలో 2019లో చమురు అన్వేషణ కాంట్రాక్టును దక్కించుకొని, బ్లాక్‌-1లో తవ్వకాలు చేపట్టింది. ఈ ప్రాజెక్టుపై  రూ.1508 కోట్లు పెట్టుబడి పెట్టింది. అన్వేషణ ఫలించి 2024లో తొలిసారిగా ఎక్స్‌ఎన్‌-76 బావిలో చమురు నిల్వలు బయటపడ్డాయి. తాజాగా ఈ నెలలో ఎక్స్‌ఎన్‌-79 02ఎస్‌ బావిలో భారీగా చమురు నిల్వలు గుర్తించారు.

ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని!

అబూదాబిలో ఉర్జా భారత్‌ చమురు నిల్వల కోసం అన్వేషణ జరిపిన బ్లాక్‌-1లో సక్సెస్‌ రేటు 15 శాతం మాత్రమే ఉంది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉంటేగానీ ఆ ప్రాంతంలో చమురును గుర్తించటం సాధ్యం కాదు. కానీ, ఉర్జా భారత్‌.. రెండేళ్లలో ఏకంగా రెండు బావుల్లో చమురు నిక్షేపాలను గుర్తించింది. చమురు అన్వేషణలో భారత్‌ సామర్థ్యానికి ఓ గీటురాయిగా మారింది. ఈ ఆవిష్కరణలతో.. పశ్చిమాసియాలో చమురు అన్వేషణలో ఉన్న సంస్థలు, దేశాలన్నింటినీ తనవైపు తల తిప్పి చూసేలా చేసింది ఉర్జా భారత్‌.

భవిష్యత్తులో మరిన్ని చమురు నిల్వలను గుర్తించే అవకాశం

ఉర్జా భారత్‌ ఆధీనంలో ఉన్న బ్లాక్‌-1.. 6,162 కి.మీ. పరిధితో కూడిన విశాల ప్రాంతం. విదేశాల్లో భారత్‌ చేపట్టిన అతి పెద్ద చమురు అన్వేషణ ఇదే. భవిష్యత్తులో ఇక్కడ మరిన్ని చమురు నిల్వలను గుర్తించే అవకాశం ఉంది. చమురు ఉత్పత్తిలో భారత్‌ వేగంగా అడుగులు వేయటం స్వావలంబనకు తోడ్పడనుంది. అంతేకాదు, యూఏఈతో సంబంధాలు మరింత మెరుగుపడి.. భారత్‌ చమురు అవసరాలకు సంబంధించి మరో నమ్మకమైన భాగస్వామ్యదేశంగా యూఏఈ ఆవిర్భవించే అవకాశాలూ ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button