Unnao Rape Case: సంచలనం సృష్టించిన 2017 ఉన్నావ్ రేప్ కేసులో నిందితుడు కులదీప్ సింగ్ సెంగార్‌కు ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన బెయిలుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. బాధితురాలి తండ్రి కస్టోడియల్ మరణం, ఆమె బంధువులు, న్యాయవాది అనుమానాస్పద మృతి, చివరికి బాధితురాలిని కూడా చంపే ప్రయత్నం చేసిన సంఘటనల క్రమంలో ఢిల్లీ హైకోర్టు నిందితుడికి బెయిలు ఇవ్వడంపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో బెయిలును సవాలుచేస్తూ సీబీఐ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తూ సెంగార్ బెయిలును నిలిపివేసింది. ఈ మేరకు సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఆదేశాలు జారీ చేసింది.
విచారణ జనవరి 20కి వాయిదా
సాధారణంగా ఒక నిందితుడికి కింది కోర్టు బెయిలు ఇచ్చినపుడు అతని వాదన వినకుండా బెయిలు రద్దు చేయరాదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అయితే, ఈ కేసులో బెయిలు వచ్చినప్పటికీ వేరే కేసులో అతను ఇప్పటికీ జైల్లోనే ఉన్నందున ఈ కేసులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బెయిలు నిలిపివేత నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించింది. సీబీఐ పిటిషన్‌పై 4వారాల్లో సమాధానం ఇవ్వాలని సెంగార్‌ను ఆదేశించింది. విచారణను జనవరి 20కి వాయిదా వేసింది.
మరణశిక్ష పడే వరకూ పోరాటం
సెంగార్‌కు మరణశిక్ష పడే వరకూ తన పోరాటం ఆగదని బాధితురాలు తెలిపారు. సెంగార్‌కు ఉరిశిక్ష పడినప్పుడే తన తండ్రికి, తనకు న్యాయం జరుగుతుందని తెలిపారు. దేశ అత్యున్నత న్యాయస్థానంపై తనకు అపారమైన నమ్మకం ఉందన్నారు. మరోవైపు, తన తండ్రికి న్యాయం కావాలని కోరుతూ సెంగార్ కుమార్తె ఇషిత ఎక్స్ వేదికగా బహిరంగ లేఖ విడుదల చేశారు. తన తండ్రి ఎదుర్కొంటున్న విచారణ కారణంగా తన కుటుంబానికి బెదిరింపులు వస్తున్నాయని లేఖలో స్పష్టం చేశారు. ఒక కూతురిగా ఎంతో అలసిపోయానని, ఇంకా చిన్న ఆశ ఏదో మిగిలివుందని ఆశాభావం వ్యక్తం చేశారు.





