
UIDAI School Biometric Drive: దేశంలోని పౌరులు అందరికీ కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును జారీ చేసింది. అప్పుడే పుట్టిన పిల్లల దగ్గరి నుంచి పండు ముసలి వరకు ఈ కార్డులను అందిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు అన్నీ ఆధార్ ఆధారంగానే లబ్దిదారులకు చేరవేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ ను పకడ్బందీగా జారీ చేస్తున్నారు. గతంలో ఆధార్ జారీ విషయంలో అధికారులు అలసత్వం వహించినా, ఇప్పుడు కఠినంగా ప్రక్రియ చేపడుతున్నారు. భారతీయులకు మాత్రమే ఆధార్ అందేలా జాగ్రత్తలు పడుతున్నారు.
స్కూళ్లలోనే పిల్లల ఆధార్ అప్ డేట్!
ఇక ఆధార్ అప్ డేట్ విషయం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(UIDAI) కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలోనే పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్ డేట్ ప్రక్రియను చేపట్టేలా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన గ్రౌండ్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. మరో 2 నెలల్లో విడతల వారీగా బయోమెట్రిక్ అప్ డేట్ ప్రక్రియను చేపట్టనున్నట్లు UIDAI అధికారులు తెలిపారు.
ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారంటే?
వాస్తవానికి ఇప్పుడు అప్పుడే పుట్టిన బిడ్డకు కూడా ఆధార్ ఇస్తున్నారు. పిల్లలకు ఐదేళ్లు వచ్చిన తర్వాత ఆధార్ లో బయోమెట్రిక్స్ ను అప్ డేట్ చేయాలి. కానీ చాలా మంది అప్ డేట్ చేయడం లేదు. ఇప్పటి వరకు 7 కోట్లకు పైగా పిల్లల బయోమెట్రిక్స్ అప్ డేట్ చేయలేదని UIDAI సీఈవో భువ్‌నేష్ కుమార్ తెలిపారు. 15 ఏళ్ల వయసు వచ్చిన పిల్లల బయోమెట్రిక్ అప్ డేట్ చేయడానికి స్కూళ్లు, కాలేజీలలో ఈ ప్రక్రియను చేపట్టాలని భావిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా పిల్లలందరి ఆధార్ అప్ డేట్ ఈజీ అవుతుందన్నారు.
Read Also: రాష్ట్రపతి ముర్ము సందేహాలు, 22న సుప్రీంలో కీలక విచారణ