UAE Cancels Islamabad Airport Deal with Pakistan: భారత్‌కు మరింత చేరువయ్యేందుకు కొంతకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాజాగా పాకిస్థాన్ కు షాకిచ్చింది. ఆ దేశంతో కుదుర్చుకున్న ఎయిర్‌పోర్ట్ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు ప్రకటించింది. యూఏఈ ప్రెసిడెంట్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ రీసెంట్ గా భారత్ లో పర్యటించిన వెళ్లిన వారం రోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం ఆసక్తికరం. యూఏఈ ప్రెసిడెంట్ బిన్ జాయెద్ భారత్ పర్యటనలో రెండు గంటల సేపు ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొని ఆ వెంటనే వెళ్లిపోయారు. ఈ సమావేశంలో కీలక ఒప్పందాలు జరిగినట్టు రెండు దేశాలూ ప్రకటించాయి.
పాకిస్తాన్ తో చేసుకున్న ఎయిర్ పోర్ట్ డీల్ రద్దు
పాకిస్థాన్‌తో గత ఏడాది ఆగస్టులో చేసుకున్న ఎయిర్‌పోర్ట్ డీల్‌ను రద్దు చేసుకుంటున్నట్టు యూఏఈ ప్రకటించింది. ఇస్లామబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ను నిర్వహిస్తామని అప్పట్లో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. కాగా, పాక్‌తో డీల్‌ను యూఏఈ రద్దు చేసుకున్నట్టు పాకిస్థాన్ మీడియాలో కూడా కథనాలు వచ్చాయి. ఎయిర్‌పోర్ట్ నిర్వహణలో స్థానిక భాగస్వామిని ఎంపిక చేసుకోవడంలో యూఏఈ విఫలమైందని, ఈ విషయంలో పలుమార్లు జాప్యం తలెత్తి.. చివరికి ఆ ఒప్పందంపై యూఏఈ ఆసక్తి కోల్పోయిందని తెలుస్తోంది.
యూఏఈ ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది?
పాకిస్థాన్ ఇటీవల కాలంలో ఇస్లామిక్ నాటో ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. సౌదీని కలుపుకొని వెళ్లాలనుకుంటోంది. ఇది యూఏఈకి ఏమాత్రం ఇష్టంలేదు. యెమెన్ విషయంలో సౌదీ-యూఏఈ మధ్య ఉన్న వివాదం కూడా ఇందుకు కారణం. ఇస్లామిక్ నాటోకు ప్రతిగా ఇండియా, ఇజ్రాయెల్‌తో కలిసి కూటమి ఏర్పాటు చేసే ఆలోచనలో యూఏఈ ఉంది. ఈ క్రమంలో ఇండియాకు చేరువ కావడమే సరైన నిర్ణయంగా యూఏఈ భావిస్తోంది. పాక్‌తో డీల్ రద్దు చేసుకోవడం వెనుక కూడా ఇదే ఉద్దేశం ఉండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.





