సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ వర్గపోరు తారా స్థాయికి చేరింది. ఎమ్మెల్యే మందుల సామేలు, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయుల మధ్య వార్ సాగుతోంది. కొన్ని రోజులుగా ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండగా.. తాజాగా కొట్టుకునే వరకు వచ్చింది. ఎమ్మెల్యే అనుచరుడిపై దాడి చేశారు సొంత పార్టీ కార్యకర్తలు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌కు జాజిరెడ్డిగూడెం మండలానికి చెందిన కాంగ్రెస్ నేత గుడిపల్లి మధుకర్ రెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉన్నారు.గుడిపల్లి మధుకర్ రెడ్డి ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలుగుతున్నాడని కక్ష కట్టిన కాంగ్రెస్ పార్టీలోని వేరే వర్గం.. ఇతని ఇంటికి వెళ్లి దాడి చేశారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించగా, అక్కడ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు.
మధుకర్ రెడ్డిపై దాడి చేసింది మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి వర్గీయులు కావడంతో పోలీసులు ఏం చేయలేకపోతున్నారని అంటున్నారు. ఇటీవలే ఎమ్మెల్యే సామేలుకు వ్యతిరేకంగా తుంగతుర్తి కాంగ్రెస్ నేతలు రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. రాంరెడ్డి దామోదర్ రెడ్డి డైరెక్షన్ లో ఈ సమావేశం జరిగిందని తెలుస్తోంది. అయితే ఈ సమావేశానికి వెళ్లకుండా కొందరు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే సామేలే తమను అరెస్ట్ చేయించారని రాంరెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యాయని తెలుస్తోంది.
ఇసుక దందాల వ్యవహారంలోనే ఇరు వర్గాల మధ్య గొడవ జరుగుతుందని తెలుస్తోంది. ఇసుక రీచ్ ల దగ్గర వసూళ్లకు ఎమ్మెల్యే అనుచరులతో పాటు మాజీ మంత్రి మనుషులు పోటీ పడుతున్నారని అంటున్నారు. తనతో గతంలో బీఆర్ఎస్ లో పనిచేసిన నేతలకే సామేలు ప్రాధాన్యత ఇస్తున్నారని రాంరెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు.