
అమెరికాలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. వర్క్ ఫ్రం హోం చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుకు గురైన ఓ తెలంగాణ వాసి ప్రాణాలు కోల్పోయాడు. కుటుంబానికి దూరంగా, ఉద్యోగ బాధ్యతల మధ్య ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటన అందరినీ కలచివేసింది. తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం బొల్లారం గ్రామానికి చెందిన హర్షవర్ధన్ రెడ్డి (45) అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. గత పదేళ్లుగా ఫ్లోరిడా రాష్ట్రంలో నివసిస్తూ ప్రముఖ సంస్థలో పని చేస్తున్న హర్షవర్ధన్ ఇటీవల ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నాడు.
ఈ క్రమంలోనే నివాసంలో ల్యాప్‌టాప్ ముందు పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఛాతినొప్పి రావడంతో కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యలోనే గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు సమాచారం. హర్షవర్ధన్ ఆకస్మిక మరణం ఆయన కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. భార్య, కుమారుడు ఒక్కసారిగా తమ ఆధారాన్ని కోల్పోవడంతో కన్నీటిపర్యంతమయ్యారు. విదేశాల్లో ఉన్నప్పటికీ కుటుంబ బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న వ్యక్తిగా ఆయనకు మంచి పేరు ఉందని సన్నిహితులు చెబుతున్నారు.
ఇక స్వగ్రామమైన బొల్లారంలో కూడా ఈ వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. గ్రామస్తులు, బంధువులు ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే హర్షవర్ధన్ ఇలా అకస్మాత్తుగా మరణించడం ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు. హర్షవర్ధన్ తండ్రి సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం బొల్లారం గ్రామ సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. ప్రజాసేవలో ఉన్న కుటుంబానికి చెందిన వ్యక్తి మరణం కావడంతో స్థానికంగా రాజకీయ, సామాజిక వర్గాల్లో కూడా సంతాపం వెల్లువెత్తింది. పలువురు ప్రజాప్రతినిధులు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ALSO READ: రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తున్నారా? అయితే డేంజరే!





