
ఒకటి కాదు.. రెండు కాదు.. 16 రోజుల అన్వేషణ. అడుగడుగునా అడ్డంకులతో… అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. ఎటు చూసినా బురద… పైనుంచి ఊరుతున్న నీరు. ఎన్ని ప్రతికూలతలు ఉన్నా… వెనకడుగు వేయలేదు ప్రభుత్వం. SLBC టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది జాడ తెలుసుకునేందుకు విశ్వప్రయత్నం చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న టన్నెల్ నిపుణులను రప్పించింది. ర్యాట్ హోల్ మైనర్స్… ఆర్మీ, నేవీ.. అందరూ రంగంలోకి దిగారు. రాత్రింబవళ్లు అన్వేషించారు. నీటి డెడ్‌బాడీని కనిపెట్టే మిషన్లు, పుష్ కెమెరాలు అన్నీ వినియోగించారు. చివరికి… కేరళ నుంచి జాగిలాలను తెప్పించారు. అవి… మృతదేహాల ఆనవాళ్లు గుర్తించినట్టు సమాచారం.
టెన్నెల్లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి 100 మీటర్ల దూరంలో డీ-2 పాయింట్ దగ్గర 8 మంది ఆనవాళ్లను కేరళ డాగ్స్ గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో… మృతదేహాలు ఉండొచ్చని భావిస్తున్నారు. అక్కడ పేరుకుపోయిన మట్టిని జాగ్రత్తగా తొలగిస్తున్నారు. సాయంత్రానికి డెడ్‌బాడీలను బయటకు తీసే అవకాశాలు ఉన్నాయి. సహాయక చర్యల్లో రోబిటిక్స్‌ను కూడా వినియోగిస్తున్నారు అధికారులు.
డెడ్‌బాడీలు ఉండొచ్చని భావిస్తున్న ప్రాంతం అత్యంత ప్రమాదకరంగా ఉంది. టెన్నెల్లో 14 కిలోమీటర్ల సొరంగం ఉండగా.. చివరి 50 మీటర్లు అత్యంత ప్రమాదకరంగా ఉంది. అక్కడ శిథిలాలను తొలగిస్తే… సొరంగం పైకప్పు మళ్లీ కూలిపోయే ప్రమాదం ఉంది. దీంతో.. అక్కడ సహాయచర్యలు చేపట్టడం ఒక సవాల్ అనే చెప్పాలి. అయితే.. ఆ ప్రాంతంలోనే మృతదేహాల ఆనవాళ్లను గుర్తించినట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతానికి వెళ్తే.. రెస్క్యూ బృందాలు కూడా ప్రమాదంలో చిక్కుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో రిస్క్ తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదు. ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకుంటోంది. సహాయకచర్యల్లో రోబోలను వినియోగిస్తోంది. అందు కోసం సుమారు 4 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.
గత నెల (ఫిబ్రవరి) 22న టన్నెల్‌లో ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ (SLBC) టెన్నెల్ కూలింది. అందులో 8 మంది చిక్కుకుపోయారు. వారి కోసం… అప్పటి నుంచి సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే… ఇప్పుడు సహాయకచర్యలు తుదిదశకు వచ్చినట్టు తెలుస్తోంది. సాయంత్రం లేదా రేపటికి (సోమవారం) పురోగతి ఉంటుందని భావిస్తున్నారు.