తెలుగు సినీ ఇండస్ట్రీలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన రేపిన భూకంపం చల్లార్చే ప్రయత్నాల్లో ఉన్నారు ఇండస్ట్రీ ప్రముఖులు. ప్రముఖులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసే యోచనలో ఉన్నట్లు తెలిసింది. గేమ్ చేంజర్ ప్రిరిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్లిన ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు తిరిగి రాగానే ముఖ్యమంత్రిని కలుస్తామని నిర్మాత నాగవంశీ తాజాగా మీడియాకు తెలిపారు. టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలపై చర్చిస్తామన్నారు.
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన, అధిక ధరల విమర్శల కారణంగా ఇకనుంచి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు, సినిమా టికెట్ ధరల పెంపును రద్దు చేస్తున్నట్టు సీఎం ప్రకటించడం సంచలనం రేపింది. దీని ప్రభావం వచ్చే సంక్రాంతికి విడుదల కానున్న పెద్ద సినిమాలు ‘గేమ్ ఛేంజర్’, ‘డాకు మహారాజ్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’పై పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రిని కలిసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.