
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి హాజరుకాబోతున్నారు. ఈనెల 9 నుంచి జరిగే తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఆయన హాజరుకానున్నారు. గత బడ్జెట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజు మాత్రమే కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. బడ్జెట్ తర్వాత మీడియా పాయింట్ వద్ద మాట్లాడి వెళ్లిపోయారు. ఒకరోజు అసెంబ్లీకి వచ్చి మొహం చాటేసారని అధికార పార్టీ ఆరోపించింది.
అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ వ్యవసాయ క్షేత్రం నుంచే పార్టీ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఏడాదిన్నర కాలంగా మూడుసార్లు మాత్రమే తెలంగాణ భవన్‌లో సమావేశాలు నిర్వహించారు. రెండు వారాల క్రితం జరిగిన సమావేశంలోప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రకటించారు కేసీఆర్. పార్టీ ఆవిర్భావించి 25ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత.
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీశ్రేణులకు పిలుపునిచ్చిన కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతుండటంతో సభకు హాజరుకావాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. SLBC, కాళేశ్వరం, అప్పుల విషయంలో ప్రభుత్వ తీరును సభ సాక్షిగా కేసీఆర్ ఎండగడతారంటున్నారు బీఆర్ఎస్ నేతలు.చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వెళ్తున్న కేసీఆర్ ఏం మాట్లాడుతారన్నది ఆసక్తికరంగా మారింది.