
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ బ్యూరో:- కొండా మురళి… తగ్గేదేలే అంటున్నారు. అందరిదీ ఒకదారైతే.. ఉలిపిగడ్డది మరో దారి అనట్టు… వరంగల్ కాంగ్రెస్ పార్టీలో కొండా వర్గం ఒక వైపు.. మిగిలిన నేతలంతా మరో వైపు అన్నట్టు రాజకీయం సాగుతోంది. ఉమ్మడి వరంగల్‌లోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు ప్రజాప్రతినిధులు అందరూ కొండా మురళికి వ్యతిరేకంగా నిలబడ్డారు. అయినా… తగ్గడం లేదు కొండా మురళి. అందరినీ… ఒంటరిగానే ఎదుర్కొంటున్నారు. మాటల తూటాలు పేల్చుస్తున్నారు. ఓరుగల్లు పంచాయితీ గాంధీభవన్‌కు చేరినా… పరిష్కారం మాత్రం అంతుబట్టడంలేదు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, నేతలపై విమర్శలు చేసి… రచ్చ రంబోలా చేశారు కొండా మురళి. ఆ అగ్గి రాజుకుంటుండగానే… మళ్లీ తన విమర్శలతో ఆజ్యం పోశారు. దీంతో… వివాదం దావానలమవుతోంది. ఇప్పటికే వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్‌రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగారాజు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరితోపాటు జిల్లాలోని పలువురు నేతలపై బహిరంగంగానే విమర్శలు చేశారు. ఆ గొడవ.. క్రమశిక్షణా కమిటీ ముందుకు వెళ్లింది. అక్కడా.. కొండా మురళి.. వెనక్కి తగ్గలేదు. క్రమశిక్షణా కమిటీకి ఇచ్చిన లేఖలో మరిన్ని విమర్శలు చేశారు. మంత్రి పొంగులేటి కూడా కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నట్టు అనిపిస్తోంది లేఖలో రాసిచ్చేశారు. కట్ చేస్తే.. ఆ తర్వాత ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఇంట్లో.. కొండా మురళి వ్యతిరేకవర్గమంగా సమావేశమైంది. దీంతో.. కొండా మురళి మరోసారి విశ్వరూపం చూపిస్తున్నారు. సంచలన విషయాలు బయటపెట్టారు. గత ఎన్నికల్లో ఎలా గెలిచారో… ఎంత డబ్బు ఖర్చు పెట్టారో మొత్తం చెప్పేశారు.
2023 తెలంగాణ ఎన్నికల్లో గెలిచేందుకు దాదాపు 70 కోట్లు ఖర్చుపెట్టినట్టు కొండా మురళి చెప్పారు. తనకు 500 ఎకరాల భూమి ఉంటే.. అందులో 16 ఎకరాలు అమ్మి… వచ్చిన డబ్బు ఎన్నికల కోసం ఖర్చుపెట్టానన్నారు. అమ్మవారి సాక్షిగా తనకు ఎవరి డబ్బులూ అవసరంలేదన్నారు. తాను ఎవరికీ భయపడనని కూడా స్పష్టం చేశారు కొండా మురళి. అంతేకాదు.. ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని కూడా చెప్పారు. కొండా మురళి అన్నీ మాటల్లో… ఒక్క మాట హైలెట్ అవుతోంది. తాను ఎవరికీ భయపడను అని.. ఆయన ఆ మాట ఎందుకు అన్నారు. అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. అంటే… తాను ఇంతకు ముందు పార్టీ నేతలపై చేసిన వ్యాఖ్యలకు జులై 5వ తేదీలోగా సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో తాను ఎవరికీ భయపడను అని అన్నారంటే.. దీని వెనుక ఏదో గూడార్థం ఉందని అంటున్నారు కొందరు విశ్లేషకులు.
కొండా మురళి వ్యాఖ్యలతో మరోసారి వరంగల్ రాజకీయాలు హైలెట్ అయ్యాయి. కొండా మురళి మాత్రమే కాదు.. అటు ఆయన ప్రత్యర్థి వర్గం కూడా తగ్గడంలేదు. దీంతో… రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది…? స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో… పార్టీ అధిష్టానం ఏం నిర్ణయం తీసుకోబోతోంది…? వరంగల్ కాంగ్రెస్‌లో నేతల మధ్య వర్గపోరు, ఆధిపత్య పోరుకు ఎలాంటి పరిష్కారం చూపిస్తుంది…? అన్నది ఆసక్తికరంగా మారింది.