
కల్వకుర్తి, క్రైమ్ మిర్రర్ :- ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ శాంతియుత ఉద్యమాలను అణిచివేయాలనే ప్రయత్నాలు సహించబోమని ఊర్కొండ మండల జేఏసీ నేతలు తీవ్రంగా హెచ్చరించారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, ఊర్కొండపేట బ్రహ్మోత్సవాలకు హాజరవుతున్న నేపథ్యంలో, గత పది రోజులుగా రిలే నిరాహార దీక్ష చేపడుతున్న జేఏసీ నాయకులు తమ ప్రజాస్వామ్య హక్కుగా నిరసన వ్యక్తం చేయడానికి ప్రయత్నించగా, వారిని అడ్డుకునే ఉద్దేశంతో అర్ధరాత్రి అక్రమంగా నిర్బంధించి అరెస్టు చేయడం తీవ్ర వివాదానికి దారి తీసింది.
జేఏసీ నేతలను అర్ధరాత్రి వారి నివాసాల నుంచి తీసుకెళ్లి కల్వకుర్తి సర్కిల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. నోటీసులు ఇవ్వకుండా, కారణాలు తెలియజేయకుండా ఇలా అరెస్టులు చేయడం ప్రభుత్వ యంత్రాంగం ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కినట్టేనని జేఏసీ నాయకులు మండిపడ్డారు. అర్ధరాత్రి వేళ ఇలాంటి అక్రమ అరెస్టులు చేయడం స్థానిక ఎమ్మెల్యే మరియు పాలక వర్గాల దమనకాండకు నిదర్శనమని ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సాగుతున్న ఉద్యమాలను అణిచివేయాలనే ప్రయత్నాలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరని జేఏసీ నేతలు స్పష్టం చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపగలమని ప్రభుత్వం భావిస్తే అది వారి అపోహ మాత్రమేనని, ఈ చర్యలతో ఉద్యమం మరింత ఉధృతంగా కొనసాగుతుందని హెచ్చరించారు. ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్న తమ పోరాటం వెనక్కి తగ్గేదేలేదని స్పష్టంగా ప్రకటించారు. అత్యంత త్వరలో జడ్చర్లలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు కూడా వెనుకాడబోమని జేఏసీ నేతలు సవాలు విసిరారు. అక్రమ అరెస్టులు, బెదిరింపులు ఉద్యమ స్ఫూర్తిని మరింత బలపరుస్తాయని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఉద్యమాన్ని అణచివేయాలనే ప్రయత్నాలపై ప్రజలే తగిన తీర్పు చెబుతారని పేర్కొన్నారు. ఈ అక్రమ అరెస్టుల్లో జేఏసీ ఉద్యమ నాయకులు నిరంజన్ గౌడ్, శ్యామ్ సుందర్ రెడ్డి, చిన్న, దివాకర్ గౌడ్, అరవింద్ గౌడ్ ఉన్నట్లు జేఏసీ వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చ జరుగుతుండగా, ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Read also : నిర్లక్ష్యం వద్దు, అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే కసిరెడ్డి
Read also : మంత్రి గడ్డం వివేక్ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరికలు





