క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణ నూతన గవర్నర్ శివప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లా తో కలిసి బుధవారం (మార్చి 11, 2026) హైదరాబాద్లోని పాతబస్తీ చార్మినార్ వద్ద గల శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు.
గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద ఆశీర్వచనాలు అందుకున్నారు. అంతకుముందు ఉదయం 11:30 గంటలకు రాజ్భవన్లో (లోక్ భవన్) శివప్రతాప్ శుక్లా తెలంగాణ గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేశారు.
హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన ఆయన, రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు తెలంగాణకు బదిలీ అయ్యారు. మార్చి 10న హైదరాబాద్ చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. గవర్నర్ హోదాలో బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం విశేషం.
