జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఫారెస్ట్ ఆఫీస్‌లో దావత్ చేసుకోవడం దుమారం రేపింది.కొందరు ఫారెస్ట్ అధికారులు మద్యం సేవించి జల్సా చేశారు. దసరా సందర్భంగా మైసమ్మకు యాటను కోసి అటవీశాఖ చెందిన కొందరు అధికారులు దావత్ చేసుకున్నారు. జిల్లా ఫారెస్ట్ ఆఫీస్ కార్యాలయం ఆవరణలో మద్యం సేవించడం వివాదాస్పదంగా మారింది.
కొందరు టింబర్ సామిల్ డిపోల నిర్వాహకులు మందు దావత్‌కు స్పాన్షర్ చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణలో కొందరు సామిల్ నిర్వాహకులతో పాటు ఫారెస్ట్ ఆఫీసర్లు మద్యం తాగినట్లు స్థానికులు తెలిపారు. విషయం మీడియా చెవిన పడడంతో కవరేజ్ కోసం వెళ్ళిన రిపోర్టర్లను చూసి సామిల్ టింబర్ డిపోల యజమానులతో పాటు కొందరు ఫారెస్ట్ సిబ్బంది అక్కడ నుండి జారుకున్నారు. ఇదేంటని ప్రశ్నించిన మీడియాపై అక్కడే ఉన్న కొందరు ఫారెస్ట్ ఆఫీసర్లు దురుసుగా ప్రవర్తించారు.
ఈ ఘటనపై జిల్లా ఫారెస్ట్ అధికారి రవి ప్రసాద్‌ను మీడియా ప్రతినిధులు వివరణ కోరారు. ఈ విషయం తనకు తెలియదని ఘటనపై దర్యాప్తు చేసి బాధ్యులపై డిపార్ట్మెంట్ పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.