Wednesday, March 4, 2026
Homeతెలంగాణమాయమవుతున్న గంగరాయి చెరువు… హైడ్రా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం

మాయమవుతున్న గంగరాయి చెరువు… హైడ్రా అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల్లో ఆగ్రహం

తుర్కయంజాల్‌, రంగారెడ్డి జిల్లా: తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మన్నెగూడ గ్రామంలోని గంగరాయి చెరువు అస్తిత్వాన్ని కోల్పోతూ మాయమవుతోంది. మొత్తం 15.3 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ చెరువులో 3.35 ఎకరాలు ఎఫ్టీఎల్ భూములుగా గుర్తించబడ్డా, వాటిపై అక్రమ మట్టిపూడికలు, ఆక్రమణలు బహిరంగంగానే కొనసాగుతుండటంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగుతోంది.

స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం, హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో హద్దులు నిర్ణయించకపోవడమే అక్రమార్కులకు సానుకూలంగా మారిందని, వారు చెరువు గర్భభాగాన్ని టిప్పర్లు, జెసిబీలతో పూడ్చేస్తుండటాన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.

ఎఫ్టీఎల్ భూములు అంటే ప్రభుత్వ పరిరక్షణకు లోబడి ఉండాల్సిన భూములు, వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడమంటే ప్రభుత్వ నిబంధనలకే పెనుద్రోహం అని స్థానికులు మండిపడుతున్నారు. చెరువు నాశనం కాబడితే పరిసర కాలనీలకు వరద ముప్పు పొంచి ఉన్నదని, భవిష్యత్తులో ప్రమాదాలను ఆపడం అసాధ్యమవుతుందని హెచ్చరిస్తున్నారు.

చెరువు ఆక్రమణపై అనేకసార్లు ఫిర్యాదు చేసినా, హైడ్రా అధికారులు కనీస స్పందన కనబర్చలేదని, ఇటు మున్సిపల్ అధికారులు కూడా చేతులెత్తేస్తున్నారని వాపోతున్నారు. “మేము భవిష్యత్తు కోసం చెరువు కాపాడాలని చూస్తే, అధికారులు మాత్రం ప్రస్తుత మౌనంతో అక్రమార్కులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు” అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్థానికులు అధికారులను ఎరలుగా చేసి ఆక్రమణలు సాగుతున్నాయని ఆరోపిస్తూ, తక్షణం అధికారుల జోక్యం, చెరువు ఆక్రమణలపై చర్యలు, మరియు ఎఫ్టీఎల్ భూముల హద్దులు ఖచ్చితంగా గుర్తించి, రక్షణ గోడలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకూ, భవిష్యత్తు తరాలకూ చెరువులు జీవనాధారంగా నిలుస్తాయని గుర్తించి, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments