
ఒక పుస్తకం ధర రూ.15 కోట్లు అని వినగానే చాలామందికి ఆశ్చర్యం కలుగుతుంది. సాధారణంగా మార్కెట్లో అత్యంత ఖరీదైన పుస్తకాల ధర కూడా కొన్ని లక్షలను మించదు. అయితే బిహార్‌కు చెందిన రచయిత రత్నేశ్వర్ రూపొందించిన మై రత్నేశ్వర్ అనే గ్రంథం మాత్రం ఈ లెక్కలన్నింటినీ దాటి, పట్నాలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో అత్యంత చర్చనీయాంశంగా నిలిచింది. ఈ పుస్తకానికి లక్షలు కాదు, కోట్లు కాదు.. నేరుగా రూ.15 కోట్లు ధర నిర్ణయించబడిందంటూ రచయిత స్వయంగా చెప్పడంతో దీనిపై దేశవ్యాప్తంగా ఆసక్తి మరింతగా పెరిగింది. అయితే ఈ పెద్ద ధర వెనుక దాగున్న కథ అసలు ఏమిటి, రచయిత ఎందుకు దీనిని సాధారణ రచనగా కాక దైవ ప్రసాదంగా భావిస్తున్నారన్నది ఇప్పుడు అందరి ప్రశ్న.
రత్నేశ్వర్ చెబుతున్న కథ ప్రకారం.. ఈ గ్రంథం సాహిత్య రచన కాదు, తనకు దైవం ప్రసాదించిన జ్ఞానమట. ఈ పుస్తకం పుట్టుకకు కారణమైన ప్రయాణం సాధారణ ప్రయాణం కాదట. ఏకంగా 16 నెలల పాటు అడవుల మధ్య వనవాస జీవితం గడుపుతూ, ప్రకృతి నిశ్శబ్దం మధ్య శ్రీకృష్ణుడి సాన్నిధ్యాన్ని అనుభవించానని ఆయన పేర్కొంటున్నారు.వనవాసం కాలంలో తనలో ఒక కొత్త అంతఃచైతన్యం మేల్కొని, జీవన సత్యాలపై లోతైన ఆలోచనలు మొదలయ్యాయని, ఆ సమయంలో లభ్యమైన ఆధ్యాత్మిక అనుభవాలే ఈ పుస్తకానికి బీజం అయ్యాయని ఆయన విశ్వసిస్తున్నారు.
అంతేకాకుండా, తన ఆత్మిక ప్రయాణం కేవలం వనవాసంతో ఆగలేదని, 21 రోజుల పాటు స్థితప్రజ్ఞ స్థితిలో శరీరాన్ని వదిలి బ్రహ్మలోక సందర్శన చేశానని రత్నేశ్వర్ చెప్పిన విషయాలు ఈ పుస్తకం చుట్టూ మరింత మర్మాన్ని సృష్టిస్తున్నాయి. సాధారణ జీవితంలో ఈ కథలు నమ్మడం కష్టం అయినప్పటికీ, రచయిత చెప్పే ధైర్యవంతమైన మాటలు, అద్భుత అనుభవాల వివరాలు ప్రజలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ఈ దైవిక యాత్ర ముగిసిన తర్వాత, 2006 సెప్టెంబర్ 6 నుండి 7 తేదీల మధ్య రాత్రిలో మొత్తం 3 గంటల 24 నిమిషాల వ్యవధిలో తన నోటి నుంచి ఉద్భవించిన వాక్యాలే ఈ పుస్తకమని రత్నేశ్వర్ చెబుతున్నారు. ఆ వాక్యాలు తన మనస్సులోని ఆలోచనలు కాదు, బ్రహ్మదేవుడి ఆజ్ఞతో తనకు ప్రసాదమైన జ్ఞానం అని ఆయన నమ్మకం. అంతేకాక, ఈ పుస్తకానికి రూ.15 కోట్లు ధర నిర్ణయించింది తాను కాదని, బ్రహ్మదేవుడే తెలిపారని చెప్పడంతో ఈ కథనం మరింత ఆశ్చర్యకరంగా మారింది.
ఇంత పెద్ద ధర ఉన్నప్పటికీ, ఈ గ్రంథాన్ని వాణిజ్యపరమైన ఉత్పత్తిగా చూడకూడదని రత్నేశ్వర్ అంటున్నారు. ఆయన మొత్తం 16 కాపీలు మాత్రమే ముద్రించగా, అందులో 3 మాత్రమే అమ్మకానికి, మిగతా 11 కాపీలను తన జ్ఞానాన్ని భావితరాలకు చేరవేయగలరని అనుకున్న వ్యక్తులకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నిర్ణయం రచయిత యొక్క ఆధ్యాత్మిక దృక్పథాన్ని తెలిపుతుంది.
ఈ పుస్తకంలో ఏముంది? అనేది అందరి ప్రశ్న. దీనికి సమాధానంగా రత్నేశ్వర్ చెప్పింది ఏంటంటే.. ఇది ఒక సాధారణ పుస్తకం కాదు, ఇది జీవన తత్వ శాస్త్రం. మనిషి తనలోని అంతరంగ శక్తిని, నిజమైన స్వరూపాన్ని తెలుసుకునే మార్గం చూపే దివ్య గ్రంథమని ఆయన అంటున్నారు. 12 జీవన ద్వారాలు, 19 కళలు, కర్మ, జ్ఞాన, భక్తి, ధ్యాన యోగాల గాఢమైన రహస్యాలు ఈ గ్రంథంలో వివరించబడ్డాయని ఆయన అభిప్రాయం. ఈ పుస్తకం సాధారణ ప్రజల కోసం కాదు, దీనిని కొనాలనే కోరికను కూడా వదిలేయాలని, ప్రతివారు తమలోని శక్తిని తెలుసుకునే మార్గంలో ముందుకు సాగాలని రత్నేశ్వర్ సూచిస్తున్నారు.
ALSO READ: Facts: ఈ గ్రామంలో గబ్బిలాలను దైవంలా పూజిస్తారట! ఎక్కడో తెలుసా?





