తెలంగాణ

భూసర్వే అధికారులను అడ్డుకున్న గిరిజన మహిళలు…! భారీగా మోహరించిన పోలీసులు…?

క్రైమ్ మిర్రర్ వికారాబాద్ జిల్లా ప్రతినిధి:-దుద్యాల మండలం లగచర్లలో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. పారిశ్రామిక వాడ కోసం భూసేకరణలో భాగంగా సర్వే కోసం వచ్చిన అధికారులకు రోటిబండ తండా గిరిజనులు అడ్డుకునే ప్రయత్నం చేశారు.భారీగా తరలివచ్చిన పోలీసులు వారిని వెళ్లకుండా వారించారు. దీంతో గిరిజనులకు, పోలీసులకు మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. గిరిజనులు ప్లకార్డులు చేతబూని తమ నిరసన తెలిపారు.మా అనుమతి లేకుండా పొలాల్లో సర్వే ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే పోలీస్ పహారా మధ్య అధికారులు సర్వే కొనసాగిస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి స్వంత నియోజకవర్గం కొడంగల్ పరిధిలోని లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటి బండ తండా, పులిచర్లకుంట తండాలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం దాదాపు 13 వందల ఎకరాలు భూసేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ మేరకు మూడు నెలల క్రితం ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లి కలెక్టర్‌తో పాటు పలువురు అధికారులపై గిరిజనులు, రైతులు దాడి చేశారు.ఈ ఘటన సంచలంగా మారిన విషయం తెలిసిందే. అనేక మంది రైతులు జైలు పాలయ్యారు. ప్రస్తుతం వాళ్లు బెయిల్‌పై విడుదలయ్యారు. ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు పెద్దఎత్తున ఆందోళన చేయటంతో ప్రభుత్వం ఫార్మాసిటీ ఏర్పాటుపై వెనక్కి తగ్గింది. తర్వాత అక్కడే పారిశ్రామిక వాడను ఏర్పాటు చేయాలని నిర్ణయించి భూసేకణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆయా గ్రామాల్లో భూసేకరణ కోసం అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా ఇవాళ రోటిబండ తండాకు అధికారులు సర్వే చేసేందుకు రాగా రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పోలీసులు భారీగా మోహరించి రైతులను సర్వేవైపు వెళ్లకుండా అడ్డుపడ్డారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. తమకు ఉన్న కొద్దిపాటి వ్యవసాయ పొలం పరిశ్రమల కోసం లాక్కుంటే తాము ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ఎట్టి పరిస్దితుల్లో భూములు ఇచ్చేది లేదని తేల్చి చెబుతున్నారు. పోలీసుల నిర్భందంతో సర్వేచేయటంపై మండిపడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే సర్వే నిలిపివేయించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే తమకు ఆత్మహత్యలే శరణ్య మంటున్నారు గిరిజన మహిళలు.

తమ భూముల జోలికి రావొద్దు…!

లగచర్లకు చెందిన 102 సర్వే నంబర్‌లో 43 మంది రైతులకు సంబంధించి 47.25 ఎకరాలు, రోటిబండత తండాలో అదే 102 సర్వే నంబర్‌లో 30 మంది రైతులకు చెందిన 22 ఎకరాలు, పులిచెర్లకుంట తండాలో 117. 120,121 సర్వే నంబర్లలోని 20 మంది రైతులకు చెందిన 40.15 గుంటలకు సంబంధించి భూసర్వే చేయనున్నట్టు దుద్యాల తహసీల్దార్‌ కిషన్‌ ఇప్పటికే వెల్లడించారు.లగచర్ల, రోటిబండతండా, పులిచెర్లకుంట తండాలో మొత్తంగా 110 ఎకరాల అసైన్డ్‌ భూములకు సర్వే చేపట్టి ఆయా రైతులకు సంబంధించి హద్దులను గుర్తించనున్నట్టు తెలిపారు. నిన్నటిదాక ఫార్మా!.. ఇప్పుడు పారిశ్రామిక క్లస్టర్‌!.. ప్రభుత్వం తమను ఎందుకిలా వేధిస్తున్నదని దుద్యాల మండల రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ భూముల జోలికి రావొద్దని వేడుకుంటున్నారు. తాము పోరాడి అలసిపోయామని, అయినా ప్రభుత్వం పదే పదే తమను వేధిస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు.

నాకు ఎలాంటి అరెస్ట్ వారెంట్ రాలేదు!… ఫేక్ న్యూస్ నమ్మొద్దు?

పవన్ కళ్యాణ్ తొందరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్!… అప్డేట్ ఇచ్చిన డాక్టర్లు??

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button