
ఇబ్రహీంపట్నం, జూలై 2 (క్రైమ్ మిర్రర్): రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలో దొంగలు హల్‌చల్ చేశారు. గ్రామంలోని ప్రసిద్ధ పెద్దమ్మ – గంగాదేవి ఆలయంలో గుర్తు తెలియని దుండగులు చోరీకి పాల్పడి, దాదాపు 2 లక్షల రూపాయల విలువ చేసే పంచలోహ విగ్రహాలు, అలంకార నగలు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, కేవలం 10 రోజుల క్రితమే ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ – గంగాదేవి జాతర ఘనంగా నిర్వహించారు. పండగ సందర్భంగా ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆ ఉత్సవాల ఉత్సాహం తీరకముందే దుండగులు దాడికి తెగబడ్డారు.
మరోవైపు, రామాలయం సైతం దుండగుల దృష్టిలోంచి తప్పలేదు. అక్కడ కూడా విగ్రహాలు అపహరణకు గురయ్యాయి. గతంలో కూడా ఇదే ఆలయంలో దొంగతనం జరగడం గమనార్హం. అయినప్పటికీ ఆలయానికి రక్షణకు సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల మళ్లీ ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సమీప ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. త్వరలోనే నిందితులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.