HomeతెలంగాణTelangana Politics: డి లిమిటేషన్ తో తెలంగాణలోకి టిడిపి ఎంట్రీ!

Telangana Politics: డి లిమిటేషన్ తో తెలంగాణలోకి టిడిపి ఎంట్రీ!

* గ్రేటర్ లో గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న చంద్రబాబు

* ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో పెరగనున్న నియోజకవర్గాలు

* ఖమ్మం..నల్గొండలో సైతం

* వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పోటీ

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: డీ లిమిటేషన్ తో తెలంగాణలో ఎవరికి లాభం? అధికార కాంగ్రెస్ పార్టీ కా? లేకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కా? లేకుంటే గులాబీ పార్టీకా? తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఊహించని సమాధానం వస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన తో ఎక్కువగా లాభపడేది తెలుగుదేశం పార్టీ అని ప్రచారం ప్రారంభం అయ్యింది. విశ్లేషకులు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అందుకు కారణాలను చెబుతున్నారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో తెలుగుదేశం పార్టీకి ఆయాచిత లబ్ధి చేకూరనుంది అనేది విశ్లేషకుల మాట.

కేంద్రంలో కీరోల్..

ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వంలో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. కచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజనతో ఏపీలో లాభపడేది కూటమి. తమకు నచ్చిన విధంగా నియోజకవర్గాల మార్పు, రిజర్వేషన్ల కేటాయింపు ఉంటుంది అనేది జగమెరిగిన సత్యం. అయితే తెలంగాణలో పూర్తిగా అస్తిత్వాన్ని కోల్పోయిన తెలుగుదేశం.. మరోసారి బతికేందుకు నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ దోహదపడుతుంది అనేది విశ్లేషకుల మాట. కేవలం ఆంధ్ర సెటిలర్స్, టిడిపికి బలమైన కార్యకర్తలు ఉన్నచోట నియోజకవర్గాల సంఖ్య పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. దానిని కచ్చితంగా అడ్వాంటేజ్ గా తీసుకుంటారు చంద్రబాబు. అందుకే ఇన్ని రోజులు ఆయన మౌనంగా ఉన్నారు.

చంద్రబాబు విషయంలో తగ్గుతున్న ప్రతికూలత..

తెలంగాణ సమాజంలో చంద్రబాబు పట్ల విద్వేశం రెచ్చగొట్టడంలో ప్రత్యర్థులు సక్సెస్ అయ్యారు. అయితే ఇన్ని రోజులు చంద్రబాబు పేరు చెప్పి రాజకీయం చేసిన నేతలకు తెలంగాణలో చెక్ పడింది. చంద్రబాబు విషయంలో తెలంగాణ సమాజంలో మార్పు కనిపిస్తోంది. ఆయనపై ఉన్న ప్రతికూలత తగ్గుతోంది. అందుకే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అక్కడ కీరోల్ ప్లే చేస్తోంది. ఆ పార్టీ ఎటువైపు అంతర్గతంగా మొగ్గుచూపితే.. ఆ పార్టీ విజయం సాధించే పరిస్థితి వచ్చింది. అందుకే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి తెలంగాణలో ప్రతి రాజకీయ పార్టీ టిడిపి జపం పఠిస్తుంది. ఆ పార్టీ పోటీ చేస్తే మాత్రం వర్కౌట్ కాదు కానీ.. సైలెంట్ గా ఉండి మద్దతు తెలిపిన పార్టీ మాత్రం అధికారంలోకి రావడం ఇటీవల తెలంగాణలో కనిపిస్తోంది. అయితే తన విషయంలో తెలంగాణ సమాజం లో ఉన్న అపవాదులను చంద్రబాబు అధిగమించారు. సరిగ్గా ఈ సమయంలోనే డీ లిమిటేషన్ ప్రక్రియ ద్వారా తెలంగాణలో బలపడాలన్నది చంద్రబాబు ప్రణాళికగా తెలుస్తోంది.

పెరిగే నియోజకవర్గాల్లో..

జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ఉండనుంది. ప్రస్తుతం తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజనతో 55 నియోజకవర్గాలు పెరగనున్నాయి. అవి కూడా గ్రేటర్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఆంధ్ర సెటిలర్స్ అధికంగా ఉన్న ప్రాంతాల్లో నియోజకవర్గాల పెంపు ఉంటుందన్న సంకేతాలు వస్తున్నాయి. అదే జరిగితే తెలుగుదేశం పార్టీకి అక్కడ బలం పెరిగినట్టే. ప్రస్తుతం ఆంధ్రాలో టిడిపి అధికారంలో ఉన్న నేపథ్యంలో సెటిలర్స్ విషయంలో ప్రత్యేక ప్రకటనలు చేస్తే కచ్చితంగా వారు యాక్టివ్ అవుతారు. గ్రేటర్ తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 30 నియోజకవర్గాలపై దృష్టి పెడితే టిడిపికి సునాయాస విజయం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లాలో కూడా టిడిపి బలం చెక్కుచెదరలేదు. అక్కడ కమ్మ సామాజిక వర్గం సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంది. అందుకే ఖమ్మం జిల్లాకు చెందిన కాకలు తీరిన యోధులు సైతం టిడిపి విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేయరు. చంద్రబాబు పట్ల సానుకూలంగానే ఉంటారు. ఆ పార్టీ మద్దతు లేనిదే అక్కడ గెలవడం కష్టం. అటువంటి చోట డీ లిమిటేషన్ లో కొత్త నియోజకవర్గాలు రావడం ఖాయం. ఖమ్మం జిల్లాలోనూ కూడా అదే పరిస్థితి. అందుకే నియోజకవర్గాల పునర్విభజన అనేది చంద్రబాబుకు కలిసి వచ్చే అంశంగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి చంద్రబాబు ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments