Telangana Panchayat Polls: రాష్ట్ర వ్యాప్తంగా పంచాయితీ ఎన్నికల తొలి విడుదల ప్రచారం ఇవాళ్టితో ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం ఫలితాలను ప్రకటించనున్నారు. తొలి విడుదలతో 189 మండలాల్లోని 4,235 గ్రామ పంచాయతీలకు తొలివిడుతలో మొత్తం 37,440 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 146 వార్డులకు నామినేషన్లు రాలేదు. 9, 331 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 27,960 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక మొదటి విడుతలో మొత్తం 56, 19, 430 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో పురుషులు 27, 41, 070 మంది ఉండగా, 28,78,159 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 201 మంది ఉన్నారు. వీరి కోసం 37, 562 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
మెజారిటీ స్థానాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫోకస్
తొలి విడుత ప్రచారం ముగుస్తుండటంతో మెజార్టీ స్థానాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫోకస్ పెట్టాయి. కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు. తొలివిడుతలో ఎక్కువ స్థానాలు సాధిస్తే, రెండు, మూడు విడుతలపై ఆ పార్టీ ప్రభావం ఉండనుంది. ఈ నేపథ్యంలోనే మొదటి విడుతపై ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
జోరుగా ప్రచారం చేస్తున్న అభ్యర్థులు
అటు పంచాయతీల్లో, ఇటు వార్డుల్లో కూడా త్రిముఖ పోటీ నెలకొన్నది. ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టారు. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తమకు కేటాయించిన గుర్తులను ప్లకార్డులుగా ప్రదర్శిస్తూ వీధుల్లో ప్రచారం చేస్తున్నారు. కొందరు ఆటోలు, ఇతర వాహనాలను ప్రచార రథాలుగా తీర్చిదిద్ది మైకులతో, అభ్యర్థి ఫొటో, గుర్తుతో ఓట్లను అభ్యర్థిస్తున్నారు. ఉదయం, సాయంత్రం ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామానికి చేయబోయే అభివృద్ధి పనులతో కూడిన హామీల కరపత్రాలను పంపిణీ చేస్తున్నారు. కేవలం ఐదు రోజులే ప్రచారానికి గడువు ఉండటంతో ప్రతి ఓటరును పలుమార్లు కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు.





