
తెలంగాణలో జరుగుతున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అరుదైన పరిణామం జరిగింది. ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. ఐదులో నాలుగు సీట్లు ఉమ్మడి నల్గొండ జిల్లాకే దక్కనున్నాయి. ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడు జరగలేదని తెలుస్తోంది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ తో పాటు అధికార పార్టీ మిత్రపక్షం సీపీఐ కూడా నల్గొండ జిల్లా నేతలనే శాసనమండలికి పంపిస్తున్నాయి. అంతేకాదు గతంలో ఎప్పుడు లేనట్లుగా ఈసారి అగ్రవర్గాలు లేకుండానే ఐదు ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నిక జరగబోతోంది.
ఐదు స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.. అసెంబ్లీలో బలాబలాల ప్రకారం నాలుగు సీట్లు కాంగ్రెస్ కు .. ఒక్క సీటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు దక్కనుంది. అధికార పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదుర్చుకున్న డీల్ ప్రకారం ఒక సీటును సీపీఐకి కేటాయించింది. ఇక తమకు దక్కే మూడు సీట్లకు సంబంధించి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఖరారు చేసింది. ఇందులో ఎస్సీ కోటాలో ఎంపికైన అద్దంకి దయాకర్, ఎస్టీ కోటాలో ఎంపికైన శంకర్ నాయక్ నల్గొండ జిల్లాకు చెందిన నేతలు. అద్దంకి దయాకర్ గతంలో రెండు సార్లు తుంగతుర్తి నుంచి పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2023 ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. శంకర్ నాయకు నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. పార్టీ కష్టకాలంలోనే ఆయన ఎక్కిడికి వెళ్లలేదు. సీనియర్ నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. జానారెడ్డి సిఫారస్ చేయడంతో శంకర్ నాయక్ కు ఎమ్మెల్సీ దక్కింది.
బీఆర్ఎస్ తమ అభ్యర్థిగా తెలంగాణ ఉద్యమకారుడు దాసోజు శ్రవణ్ కుమార్ ను ఖరారు చేసింది. హైదరాబాద్ రాజకీయాల్లో ఉన్న దాసోజు స్వగ్రామం ఉమ్మడి నల్గొండ జిల్లానే. భువనగిరి నియోజకవర్గం పరిధిలో ఆయన సొంతూరు ఉంది. అందుకే ఆయన గతంలో భువనగిరి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం ప్రయత్నించారు. కాంగ్రెస్ మిత్రపక్షం సీపీఐ తమ అభ్యర్థిగా నెల్లికంటి సత్యంను ఎంపిక చేసింది. నెల్లికంటి సత్యం ప్రస్తుతం నల్గొండ జిల్లా సీపీఐ కార్యదర్శిగా కొనసాగుతున్నారు. మునుగోడు నియోజకవర్గానికి చెందిన నెల్లికంటి సత్యంను 2023లో మునుగోడు అభ్యర్థిగా సీపీఐ ప్రకటించింది. అయితే చివరి నిమిషంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరడంతో ఆయన కోసం సీటు త్యాగం చేశారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ ఇస్తామని నెల్లికంటి సత్యంకు హామీ ఇచ్చారు. అప్పటి డీల్ లో భాగంగానే నెల్లికంటికి ఎమ్మెల్సీ సీటు దక్కింది.మొత్తంగా ఎన్నికలు జరుగుతున్న ఐదు సీట్లకు గాను.. నాలుగు సీట్లు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, దాసోజు శ్రవణ్ కుమార్, నెల్లికంటి సత్యంకు దక్కాయి.