HomeతెలంగాణTelangana Ministers: ప్రచార పర్వంలో తెలంగాణ మంత్రులు, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజీ బిజీ!

Telangana Ministers: ప్రచార పర్వంలో తెలంగాణ మంత్రులు, ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బిజీ బిజీ!

* కేరళలో స్టార్ క్యాంపెయినర్ గా రేవంత్ రెడ్డి

* ఎక్కువ మంది మంత్రులకు ఆ రాష్ట్ర బాధ్యతలే

* ఈశాన్య రాష్ట్రాలకు భట్టివిక్రమార్క, పొన్నం

* తమిళనాడు బాధ్యతలు మంత్రి ఉత్తమ్ కు

తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఇలా ముగిశాయో, లేదో.. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఇతర రాష్ట్రాల బాట పట్టారు. ఐదు రాష్ర్టాల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు నిర్వహించేందుకు తెలంగాణ మంత్రులు, నేతలను కాంగ్రెస్ అధిష్ఠానం ఎంచుకుంది. అందులోనూ ప్రత్యేకించి కేరళపై ఏఐసీసీ దృష్టి పెట్టింది. ఆ రాష్ట్రంలో పదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న నేపథ్యంలో ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ఏఐసీసీ ఉంది. ఈ మేరకు వ్యూహాలకు పదును పెడుతున్న అధిష్ఠానం.. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని స్టార్‌ క్యాంపెయినర్‌గా నియమించి కీలక బాధ్యతలు అప్పగించినట్టు తెలిసింది.

అంతేకాకుండా.. అసెంబ్లీ ఎన్నికలకయ్యే మంచీచెడుల బరువు బాధ్యతలన్నీ తెలంగాణ కాంగ్రెస్‌ నేతల మీదనే పెట్టినట్టు సమాచారం. కేరళ, అసోం, పుదుచ్చేరిలో పోలింగ్ ఏప్రిల్‌ 9న ఒకే విడతలో జరగనుంది. దీంతో ఒకవైపు రాష్ట్రంలో అసెంబ్లీ  బడ్జెట్‌ సమావేశాలు జరుగుతుండగానే, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కేరళ వెళ్లిపోయారు. అక్కడి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు. సోమవారం రాత్రి బడ్జెట్‌ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడటంతో మరికొందరు నేతలు కూడా కేరళకు తరలివెళ్తున్నారు.

ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నా తెలంగాణ నేతలు మాత్రం కేరళపైనే ఎక్కువగా దృష్టిపెట్టినట్టు సమాచారం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కాంగ్రెస్‌ పార్టీ రంగంలోకి దించింది. దీంతో అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల ప్రచారం, వ్యవహారం అంతా తెలంగాణ సీఎం కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. మంగళవారం సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రి అజారుద్దీన్‌ కేరళ వెళ్తారని విశ్వసనీయంగా తెలిసింది. పోలింగ్‌కు కేవలం 9 రోజులే ఉన్న నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గంలో 60% మంది మంత్రులను కేరళకు తీసుకెళ్తున్నట్టు గాంధీభవన్‌ వర్గాలు చెప్తున్నాయి

ఈశాన్య రాష్ట్రాలకు భట్టి, పొన్నం

ఈశాన్య రాష్ట్రం అసోం, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో కూడా ఎన్నికల వేడి తారస్థాయికి చేరింది. ఇకడ ప్రధానంగా ఎన్డీయే, కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటముల మధ్య ద్విముఖ పోటీ నెలకొన్నది. అభివృద్ధి, స్థానికత, సంక్షేమ పథకాలే ఎజెండాగా పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, పొన్నం ప్రభాకర్‌ను ఈశాన్య రాష్ర్టాల స్టార్‌ క్యాంపెయినర్లుగా నియమించారు. ఈ నేపథ్యంలో భట్టి విక్రమార్క ముందుగా సీఎంతో కలిసి కేరళ వెళ్తారని, అక్కడి నుంచి పుదుచ్చేరి వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని గాంధీభవన్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఇక నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. అభ్యర్థుల ఎంపిక, టికెట్ల ఖరారు వంటి కీలక బాధ్యతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చూసుకుంటారని ఏఐసీసీ ప్రతినిధులు చెప్పారు. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో ఈసారి రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా ఉన్నట్టు సమాచారం. ప్రముఖ సినీ నటుడు విజయ్‌ రాజకీయ అరంగేట్రం చేయడంతో సంప్రదాయ పార్టీలైన ఎండీకే, ఏఐఏడీఎంకేకు గట్టి పోటీ ఎదురవుతున్నదనే అంచనాలున్నాయి. ఈనేపథ్యంలో ఎన్నికల అనంతరం ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్‌ పార్టీ కీలక భూమిక పోషించే విధంగా ఏఐసీసీ ప్రయత్నాలు చేస్తున్నదని తెలిసింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments