Homeతెలంగాణవామపక్షాలకు కవిత గాలం...!

వామపక్షాలకు కవిత గాలం…!

  • కేరళలో కమ్యూనిస్టులకు అండగా..

  • ప్రత్యేక వీడియో విడుదల చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు

  • కాంగ్రెస్ కు ఓటు వేయవద్దు అంటూ కేరళ ప్రజలకు విజ్ఞప్తి

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: రాజకీయాల్లో వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు కల్వకుంట్ల కవిత. త్వరలో పార్టీని ప్రకటించిన ఆమె జాతీయస్థాయిలో కూడా గుర్తింపు సాధించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆమె అరెస్ట్ అయ్యారు కూడా. అప్పటినుంచి జాతీయస్థాయిలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించింది. ఇప్పుడు తన తండ్రితో విభేదించి సొంత రాజకీయ అజెండాతో ముందుకు సాగుతున్నారు. అయితే తన తండ్రి మాదిరిగా ఇతర రాజకీయ పార్టీ నేతలతో పెట్టుకోవడం లేదు. అదే సమయంలో తన సొంత రాష్ట్రంలో రాజకీయ ప్రత్యర్థులపై పైచేయి సాధించేలా ఆమె వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ముఖ్యంగా ఇప్పుడు కమ్యూనిస్టులకు ఆమె దగ్గర అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఆమె విడుదల చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

  • కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ గా..

    ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా కమ్యూనిస్టుల పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ తరపున ప్రచారం చేసేందుకు పార్టీ స్టార్ క్యాంపైనర్ గా వెళ్లారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేరళలో ఆయన సుడిగాలి పర్యటన సాగిస్తున్నారు. ఇటువంటి సమయంలో అక్కడ కమ్యూనిస్టులకు అండగా నిలబడ్డారు కల్వకుంట్ల కవిత. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయవద్దని కోరుతూ ఒక ప్రత్యేక వీడియో విడుదల చేశారు. దీనిపై కమ్యూనిస్టు పార్టీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు తెలంగాణలో కమ్యూనిస్టు పార్టీ నేతలు కవిత పార్టీకి దగ్గర అయ్యేందుకు అవకాశం ఉంది . ఇది ముమ్మాటికి కవిత వ్యూహాత్మక విజయమే.

  • రేవంత్ హవాకు బ్రేక్..

    ప్రస్తుతం కేరళలో కమ్యూనిస్టులు అధికారంలో ఉన్నారు. అక్కడ అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. అందులో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ప్రయోగించింది. స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న రేవంత్ రెడ్డి అక్కడ దూసుకుపోతున్నారు. ఏకంగా కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయ్ ను ఢీకొడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ నుంచి కల్వకుంట్ల కవిత రెండు నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఓ వీడియోను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీతో పాటు కేరళలో ప్రచారానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తీరును ఎండగట్టారు. తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేరళ ప్రజలను మోసగించేందుకు సిద్ధపడిందని ఆమె ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు అంటూ తెలంగాణ జనాన్ని మభ్యపెట్టారని.. కేరళ ప్రజలను కూడా మభ్య పెట్టేందుకు అక్కడకు వచ్చారని.. ఆయన మాటలను నమ్మవద్దని కవిత కోరిన విధానం అక్కడ ఆకట్టుకుంటుంది.

  • కమ్యూనిస్టులు వినియోగించుకుంటే..

    కేరళలో కవిత వీడియోను కమ్యూనిస్టులు చక్కగా వినియోగిస్తే మాత్రం మంచి ఫలితాలు ఉంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పైగా కవిత మరో అడుగు ముందుకు వేసి సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో దోపిడీ చేసిన సొమ్ముతో కాంగ్రెస్ పార్టీ కేరళలో గెలవాలని చూస్తోందని ఆరోపించారు. అయితే కవిత వ్యూహాత్మకంగా కమ్యూనిస్టులకు అండగా నిలిచి తెలంగాణలో తన పార్టీకి బాటలు వేసుకుంటున్నారు. కెసిఆర్ అదే కమ్యూనిస్టులను దూరం పెట్టి చాలా తప్పిదాలకు పాల్పడ్డారు. ఎందుకంటే తెలంగాణలో కమ్యూనిస్టులకు ఇప్పటికీ బలం ఉంది. ఆ బలం చూసి కవిత ఒక అడుగు ముందుకు వేశారు.. తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బావ సారూప్యత పార్టీలన్నీ ఒకే వేదిక పైకి వచ్చే అవకాశం ఉంది. తన తెలంగాణ ప్రజా జాగృతి పార్టీని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంలో వామపక్షాలు తనకు సహకరిస్తాయని కవిత భావిస్తున్నారు. అందుకే ఈ వ్యూహాత్మక ఎత్తుగడవేసినట్లు స్పష్టం అవుతుంది. మరి కవిత ప్రయత్నాలు ఎంత వరకు వర్క్ అవుట్ అవుతాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు