
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మృతికి సంతాపంగా తెలంగాణలో ఇవాళ సెలవు దినంగా ప్రకటించారు. దీంతో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడనున్నాయి. నేటి నుంచి వారం రోజుల పాటు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ మరణంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపాన్ని తెలియజేశారు. ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దేశంలో ఆర్థిక సంస్కరణలకు బీజంవేశారని తన సందేశంలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా వున్న సమయంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాటి టీఆర్ఎస్‌తో కాంగ్రెస్ పార్టీ కుదుర్చుకున్న పొత్తు నేపథ్యంలో… ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా వారి కేబినెట్ సహచరుడిగా పనిచేసిన అనుభవాన్ని కేసీఆర్ గుర్తుచేస్తుకున్నారు. ప్రధానిగా తెలంగాణ ఏర్పాటు సందర్భంగా ఆయన అందించిన మద్దతును, చేసిన కృషిని తెలంగాణ సమాజం సదా గుర్తుంచుకుంటుందని మన్మోహన్ సింగ్ ను కొనోయాడారు కేసీఆర్.