
Telangana: తెలంగాణలో అమలవుతున్న మహాలక్ష్మీ పథకానికి సంబంధించి కీలక మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన ప్రారంభించినట్లు తెలుస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న ఈ పథకాన్ని మరింత ఆధునికంగా, పారదర్శకంగా మార్చేందుకు అత్యాధునిక సాంకేతికతను జోడించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ‘స్మార్ట్ కార్డు’ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని భావిస్తోంది. తొలి దశలో ఈ స్మార్ట్ కార్డులను మహాలక్ష్మీ పథకం కింద మహిళలకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
ఈ కొత్త విధానంలో మహిళల కోసం ప్రత్యేకంగా ‘కామన్ మొబిలిటీ కార్డు’లను జారీ చేయనున్నారు. ఇవి కేవలం బస్సు పాస్‌లుగా మాత్రమే కాకుండా, మల్టీ పర్పస్ డిజిటల్ వాలెట్‌లా పనిచేసే విధంగా రూపకల్పన చేస్తున్నారు. ఈ కార్డుల రూపకల్పన, టెక్నికల్ సపోర్ట్ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది.
కామన్ మొబిలిటీ కార్డు ద్వారా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అంతేకాదు, అదే కార్డులో నగదు లోడ్ చేసుకుని మెట్రో రైలు, ఎంఎంటీఎస్ వంటి ఇతర రవాణా సదుపాయాల్లో కూడా ప్రయాణించే వెసులుబాటు కల్పించనున్నారు. దీని వల్ల మహిళలకు ఒకే కార్డు ద్వారా పలు రవాణా సేవలు పొందే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ కార్డుకు రేషన్ పంపిణీ, ఆరోగ్య సేవలు, ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా అనుసంధానం చేయాలన్నది ప్రభుత్వ దీర్ఘకాలిక లక్ష్యంగా తెలుస్తోంది.
ఈ స్మార్ట్ కార్డు అమల్లోకి వస్తే ఇకపై ప్రయాణికులు ప్రతిసారి ఆధార్ కార్డు వంటి గుర్తింపు పత్రాలను వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రతి ప్రయాణం డిజిటల్‌గా నమోదు కావడం వల్ల, ప్రయాణికుల సంఖ్య, రద్దీ ఉన్న మార్గాలు, సమయాలు వంటి అంశాలపై ఆర్టీసీకి స్పష్టమైన డేటా లభించనుంది. ఈ సమాచారం ఆధారంగా రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో అదనపు బస్సులు నడపడం, సేవలను మెరుగుపరచడం సాధ్యమవుతుందని అధికారులు భావిస్తున్నారు.
డిజిటల్ కార్డుల అమలుతో రవాణా వ్యవస్థలో పారదర్శకత పెరగడమే కాకుండా, ప్రభుత్వ ఖర్చులపై కూడా స్పష్టత వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మహాలక్ష్మీ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా సుమారు 255 కోట్ల ఉచిత ప్రయాణాలు జరిగినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు రూ.8,500 కోట్లను ఆర్టీసీకి అందించింది.
రాష్ట్ర ప్రజలందరికీ ఈ స్మార్ట్ కార్డులను భవిష్యత్తులో అందుబాటులోకి తీసుకొస్తే, ఇది తెలంగాణ డిజిటల్ విప్లవానికి నాంది కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. మహిళల ప్రయాణ సౌలభ్యం, భద్రత, పారదర్శకత పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రయత్నం ఎంతవరకు విజయవంతమవుతుందన్నది చూడాల్సి ఉంది.
ALSO READ: CI వేధింపులు.. చేయి కోసుకున్న మహిళ





