తెలంగాణ

జనవరి 30న మంత్రివర్గ విస్తరణ!కొత్త మంత్రులు వీళ్లే..

ఏడాది కాలంగా పెండింగ్ లో ఉన్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు లైన్‌క్లియర్‌ అయిందని తెలుస్తోంది. కేబినెట్‌ విస్తరణ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి హైకమాండ్ గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చిందని.. దావోస్ నుంచి రాగానే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని సమాచారం. సీఎం రేవంత్ కు ప్రస్తుతం అత్యంత సన్నిహితుడిగా మారిన రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా జనవరి చివరి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు. ఇటీవలే ఢిల్లీలో రాహుల్ దూత కేసీ వేణుగోపాల్ తో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సమావేశమయ్యారు. ఆ భేటీలోనే మంత్రివర్గ విస్తరణపై చర్చ జరిగిందని.. హైకమాండ్ నుంచి సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. కేసీ వేణుగోపాల్ సమావేశంలో ఉన్న పొంగులేటి అందుకే కేబినెట్ విస్తరణపై ప్రకటన చేశారని అంటున్నారు.

తెలంగాణ మంత్రివర్గంలో ప్రస్తుతం ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అయితే మొత్తం ఈసారి భర్తీ చేయకుండా ఇద్దరు లేదా ముగ్గురు నేతలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని పార్టీ పెద్దలు డిసైడ్‌ అయినట్టు తెలుస్తోంది. మంత్రివరగంలోకి ఎవరెవర్ని తీసుకోవాలనే దానిపై సుదీర్ఘ కసరత్తు చేశారట. ఇప్పటివరకు ఏఏ జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించలేదో.. ఆ జిల్లాలకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించారని తెలుస్తోంది.నిజామాబాద్ జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీమంత్రి సుదర్శన్ రెడ్డికి బెర్త్ ఖాయమైందని సమాచారం. మైనార్టీ కోటాలో మాజీమంత్రి షబ్బీర్‌ అలీ రేసులో ఉన్నా.. ఆయన పేరును హైదరాబాద్ జిల్లా కోటాలో పరిశీలిస్తున్నారట.

నల్గొండ జిల్లా కోటాలో మునుగోడు ఎమ్మెల్యే, సీనియర్ నేత కోమటిరెడ్డి రాజ్‌ గోపాల్ రెడ్డి ముందు వరుసలో ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాల దృష్ట్యా.. మరో నేతకు అవకాశం దక్కొచ్చని తెలుస్తోంది. ఇక రంగారెడ్డి జిల్లా నుంచి మల్‌ రెడ్డి రంగారెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిలు రేసులో ఉన్నారు.ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి మంత్రివర్గంలో చోటు ఖాయమని ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి వివేక్, ప్రేంసాగర్ రావు రేసులో ఉండగా.. సీనియర్ నేత ప్రేంసాగర్ రావువైపే మొగ్గు ఉందని తెలుస్తోంది.

బీసీ కోటాలో చాలా మంది లీడర్లు పోటీ పడుతున్నారు. వీరిలో మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముదిరాజ్‌కు చాన్స్‌ దక్కొచ్చని టాక్‌ వినిపిస్తోంది. శ్రీహరి ముదిరాజ్ కు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆశిస్సులు ఉండటంతో ఆయన ఖాయమని టాక్. మెదక్ ఎంపీగా పోటి చేసిన నీలంమధు ముదిరాజ్‌కు ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టి మంత్రివర్గంలో చోటు కల్పిస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి.

 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button