Telangana Assembly Sessions: అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 2 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక అంశాలపై చర్చించడమే కాకుండా.. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఈ దఫా సమావేశాల్లో స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో మంత్రులతో కీలక సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ భేటీలో సుదీర్ఘంగా చర్చించారు.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై కీలక చర్చ
రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఎంపీటీసీ (MPTC), జడ్పీటీసీ (ZPTC) ఎన్నికల నిర్వహణపై ఈ సమావేశాల్లో ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చించనుంది. గడువు ముగిసినప్పటికీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తున్న ఈ ఎన్నికలను త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) ఎన్నికలపై కూడా అసెంబ్లీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వ్యవసాయ రంగానికి అత్యంత కీలకమైన ఈ సంఘాల పాలకవర్గాల ఎంపికపై రైతాంగం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
బీసీ రిజర్వేషన్లపై తీర్మానం
మరోవైపు.. సామాజిక న్యాయం దిశగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం ఈ సమావేశాల్లో ప్రధాన చర్చాంశం కానుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అసెంబ్లీలో చర్చించి.. ఒక తీర్మానాన్ని ఆమోదించే అవకాశం ఉంది. రిజర్వేషన్ల పెంపు విషయంలో ఎదురవుతున్న న్యాయపరమైన, రాజ్యాంగపరమైన చిక్కులను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. 50 శాతానికి మించి రిజర్వేషన్లు పెంచాలంటే కేంద్రం జోక్యం తప్పనిసరి కాబట్టి, ఈ విషయంలో ఢిల్లీ స్థాయిలో పోరాడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి జనవరిలో జరిగే ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీయనున్నాయి. అటు నీటి పారుదల రంగానికి సంబంధించిన అంశాలు, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, రాజకీయ పరిణామాలపై ప్రభుత్వం ఒక స్పష్టమైన కార్యాచరణను వెల్లడించే అవకాశం ఉంది.





