
Technology: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అగ్రదేశాలపై తన ప్రభావాన్ని వేగంగా పెంచుకుంటూ చైనా ముందుకు సాగుతున్న తీరు అంతర్జాతీయ వేదికలన్నింటిలో చర్చనీయాంశమవుతోంది. ఇటీవల అక్కడి అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసిన ఓ అమెరికన్ ప్రయాణికుడు తన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకున్న వెంటనే అతని వీడియో విపరీతంగా వైరల్ అయింది. చైనాలో అమలు చేస్తున్న సాంకేతిక వ్యవస్థలు, పట్టణ పాలన, రోజువారీ జీవన విధానాలు ఎంత విప్లవాత్మకంగా మారిపోయాయో అతని వర్ణన స్పష్టంగా చూపించింది.
ఆ వ్యక్తి తన వీడియోను చైనాలోని పార్కింగ్ నియమాలు ఎంత కఠినంగా, ఎంత ఖచ్చితంగా అమలవుతున్నాయో వివరిస్తూ ప్రారంభించాడు. అక్కడ రోడ్డుపై ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి డిజిటల్ చెల్లింపు చేయకపోతే పార్కింగ్ సాధ్యం కాదు. ఈ చెల్లింపు పూర్తి చేసిన తర్వాతే వాహనానికి పార్కింగ్ అనుమతి లభిస్తుంది. వాహనం నిలిపి ఉంచిన ప్రదేశంలో స్పీడ్ బ్రేకర్‌ను నేలలోపలే అమర్చిన విధానం అతనికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది. వాహనం అనుమతించిన సమయాన్ని మించి నిలిపితే ఆ స్పీడ్ బ్రేకర్ ఆటోమేటిగ్గా పైకి లేచి కారును కదిలించకుండా అడ్డుకుంటుంది. మళ్లీ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి చెల్లింపు చేస్తేనే స్పీడ్ బ్రేకర్ కిందికి దిగి కారు బయటకు తీసుకునే అవకాశం లభిస్తుంది. ఇలాంటి ఖచ్చితమైన నియంత్రణ వ్యవస్థ అమెరికాలో లేదా యూరప్‌లో కనీసం ఊహించలేమని అతడు పేర్కొన్నాడు. స్కూటర్లు ఉచితంగా పార్క్ చేసుకునే అవకాశం ఉండటం కూడా అతడిని ఆశ్చర్యపరిచింది.
చైనాలో రోడ్లపై విద్యుత్ వాహనాలే ఎక్కువగా కనిపించడం మరో ముఖ్యాంశమని అతడు వివరించాడు. ట్రాఫిక్ శబ్దం చాలా తక్కువగా ఉండటం తమ దేశంతో పోలిస్తే ఒక పెద్ద మార్పుగా అనిపించిందని చెప్పాడు. పెట్రోల్ బంకులు చాలా అరుదుగా కనిపించడం చైనా విద్యుత్ వాహనాలకు ఎంత వేగంగా మారుతోందో స్పష్టంగా చూపిస్తుందన్నారు. తన మూడు పర్యటనల్లో కలిపి కేవలం రెండే పెట్రోల్ బంకులు కనిపించాయని చెప్పడం ఇందుకు నిదర్శనం.
డిజిటల్ చెల్లింపుల విషయానికి వస్తే చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉందని అతడు స్పష్టంగా తెలిపాడు. నగదు వినియోగం దాదాపుగా అంతరించిపోయినట్లేనని చెప్పాడు. సాధారణ టీ షాపుల నుంచి పెద్ద మాల్స్ వరకు ప్రతిచోటా క్యూఆర్ కోడ్లు కనిపిస్తే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదన్నారు. సాంకేతికత దేశవ్యాప్తంగా ఎంతగా సమగ్రంగా అమలవుతోందో దీనివల్ల తెలుస్తుందని వ్యాఖ్యానించాడు. అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఇంకా ఈ స్థాయికి రావడానికి చాలా కాలం పడుతుందని కూడా చెప్పాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. చైనా దైనందిన జీవన వ్యవస్థను ఇలా మారుస్తున్నది అభివృద్ధి నిధులను సరైన దిశలో వినియోగించిన ఫలితమేనని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. దేశంలో అమలు చేసే పాలన, టెక్నాలజీ, డిజిటల్ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగిస్తే ఏ దేశం అయినా ఇలాగే ప్రగతి సాధించగలదని వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.
ALSO READ: Flipkart Buy Buy Sale: ఏంటి భయ్యా.. ఇవన్నీ సగం ధరకేనా!





