
Political: ఇటీవల అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ రాక సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో చోటు చేసుకున్న గందరగోళం, విధ్వంస ఘటన రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన రాజీనామా చేయగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దానిని అధికారికంగా ఆమోదించారు. ఈ నెల 13వ తేదీన మెస్సీ పర్యటన సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనలు ప్రభుత్వానికి తీవ్ర అసంతృప్తిని కలిగించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మెస్సీ రాక సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో భద్రతా లోపాలు, నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగా తీవ్ర గందరగోళం నెలకొంది. అభిమానుల గుంపులు నియంత్రణ తప్పడంతో ఆస్తి నష్టం చోటు చేసుకోగా, ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలోనూ చర్చనీయాంశమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఘటన జరిగిన రోజే క్రీడాకారులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన ఆమె.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈవెంట్ నిర్వహణలో లోపాలకు కారణమైన ఆర్గనైజర్లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ ఘటనపై విచారణ కోసం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. కార్యక్రమ నిర్వహణలో జరిగిన లోపాలు, భద్రతా వ్యవస్థలోని వైఫల్యాలపై లోతైన విచారణ జరుపుతున్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని భావించిన అధికారులపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగానే క్రీడాశాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ రాజీనామాను ఆమోదించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
లియోనల్ మెస్సీ కార్యక్రమంలో జరిగిన విధ్వంసంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులకూ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర డీజీపీ రాజీవ్ కుమార్, బిధన్‌నగర్ సీపీ ముఖేష్ కుమార్, యువజన వ్యవహారాలు, క్రీడాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేష్‌కుమార్ సిన్హాలకు నోటీసులు పంపింది. కార్యక్రమం జరిగిన రోజున తన విధులు, బాధ్యతల్లో నిర్లక్ష్యం వహించారన్న కారణంతో డీసీపీ అనీష్ సర్కార్ (ఐపీఎస్)పై శాఖాపరమైన చర్యలు కూడా ప్రారంభించింది. అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠకు భంగం కలగకుండా ఉండేందుకే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ALSO READ: Celebrity Lifestyle: పవన్ కల్యాణ్ ధరించిన ఈ చొక్కా ధరెంతో తెలుసా?





