Omar Abdullah On India Alliance: విపక్ష ‘ఇండియా’ కూటమి ప్రస్తుతం వెంటిలేటర్‌పై ఉందంటూ జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా షాకింగ్ కామెంట్స్ చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. బీహార్ సీఎం నితీష్ కుమార్ గురించి కీలక విషయాలు వెల్లడించారు.
నితీష్ ను కన్వీనర్ గా చేస్తే బాగుండేది!
లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 2023లో ఇండియా కూటమి కోసం నితీశ్ చేసిన ప్రయత్నాలను ఒమర్ ప్రస్తావించారు. నితీశ్‌ను ఇండియా కూటమి కన్వీనర్‌గా చేసే విషయమై తాము అప్పట్లో జరిగిన సమావేశంలో చర్చించామన్నారు. నితీశ్ కూడా అందులో పాల్గొన్నట్టు చెప్పారు. ఆయన పేరును తాము గట్టిగానే ప్రతిపాదించామని, అయితే మరో నేత వీటో పవర్ తో ఉన్నారని తెలిపారు.
గత లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్డీయేలోకి జేడీయూ
ఆర్జేడీతో కొద్దికాలం భాగస్వామిగా ఉన్న నితీశ్ కుమార్ జేడీయూ 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్డీయేలో చేరింది. ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వీప్ సాధించింది. ఆర్జేడీ, కాంగ్రెస్ కేవలం 35 సీట్లకే పరిమితమయ్యాయి. ఈ వ్యవహారం ఒమర్ మాట్లాడుతూ, ఇండియా కూటమి కోలుకుంటోందని అనుకుంటున్న దశలో బీహార్ ఫలితాలతో పరిస్థితి మళ్లీ దిగజారిందన్నారు. బిహార్‌లో జేఎంఎం పార్టీని మహాగఠ్‌బంధన్‌లో చేర్చుకోకపోవడాన్ని నిలదీశారు. రేపు జేఎంఎం కూటమి జాతీయ స్థాయిలో ఇండియా కూటమిని వీడినట్లయితే తప్పెవరిదవుతుందని ఒమర్ ప్రశ్నించారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలన్నీ ఒకటిగా పనిచేయాలని, లేనట్లయితే రాష్ట్రాలకే పరిమితమైన నిర్దిష్ట కూటములుగా మిగిలిపోతాయని అన్నారు. ఇండియా కూటమిగా మనం చెప్పుకోవాలనుకుంటే మరింత సమగ్రతను సాధించాల్సి ఉంటుందని సూచించారు.
బీజేపీపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు
అటు బీహార్ ఎన్నికల్లో బీజేపీ పోరాటపటిమపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు కురిపించారు. ఎన్నికలపైనే తమ జీవితాలు ఆధారపడి ఉన్నట్టు బీజేపీ పోరాటం సాగిస్తే, ఇండియా కూటమి తమకేమీ పట్టింపులేదనట్టు వ్యవహరించిందని చెప్పారు. ఎన్డీయే తరహాలో ఎన్నికలు, ప్రచారానికి తాము కట్టుబడి లేమన్నారు. అందుకే అత్యంత ఘోరమైన ఫలితాలు చూడాల్సి వచ్చిందన్నారు ఒమర్ అబ్దుల్లా.





