
YouTube: శ్రీ హనుమాన్ చాలీసా యూట్యూబ్‌లో ఒక అద్భుతమైన రికార్డ్‌ను సృష్టించింది. భక్తి శ్రద్ధలతో ప్రతి ఇంట్లో వినిపించే ఈ పవిత్ర గీతం ఇప్పుడు యూట్యూబ్‌లో 500 కోట్లకుపైగా వీక్షణలు అందుకొని ఒక చారిత్రాత్మక మైలురాయిని చేరుకుంది. ముఖ్యంగా భారతీయ వీడియోగా ఈ స్థాయి వ్యూస్‌ను అందుకున్న మొదటి కంటెంట్ కావడం అత్యంత విశేషమైంది. భక్తి సంగీతం ప్రభావం, హనుమంతుడిపై ప్రజల భక్తి ఎంత గొప్పదో ఈ మైలురాయి మరోసారి రుజువు చేసింది.
టి-సిరీస్ సంస్థ 2011 మే 10న తన భక్తి ఛానల్ ద్వారా ‘శ్రీ హనుమాన్ చాలీసా’ వీడియోను అప్‌లోడ్ చేసింది. ప్రముఖ గాయకుడు హరిహరన్ తన మధుర గళంతో ఈ గీతాన్ని ఆలపించగా, లలిత్ సేన్ సంగీతాన్ని అందించారు. ఈ వీడియోలో టి-సిరీస్ వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ స్వయంగా నటించారు. కాలం ఎంత మారినా, టెక్నాలజీ ఎంత ముందుకు వెళ్లినా ఈ గీతం శక్తి మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. గత 14 ఏళ్లుగా లక్షలాది మంది భక్తుల గుండెల్లో స్థానం సంపాదిస్తూ, ప్రతి ఇంట్లో మార్మోగుతూ వచ్చింది.
ఈ అద్భుత విజయంపై గుల్షన్ కుమార్ కుమారుడు, టి-సిరీస్ మేనేజింగ్ డైరెక్టర్ భూషణ్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. హనుమాన్ చాలీసాకు తన జీవితంలో ప్రత్యేక స్థానం ఉందని, తన తండ్రి ఆధ్యాత్మిక సంగీతాన్ని ప్రజలకు అందించాలనే మహత్తర సంకల్పంతో పనిచేశారని గుర్తుచేసుకున్నారు. దేశ ప్రజల అచంచల భక్తి, సంగీతంపై చూపిన ప్రేమ ఈ 500 కోట్ల వీక్షణలు సాధించేందుకు కారణమని చెప్పారు. ఈ అసాధారణ రికార్డు వారిని మరింత మంచి భక్తి కంటెంట్ అందించాలనే నిబద్ధతకు ప్రేరేపిస్తుందన్నారు.
ALSO READ: Girija Oak: ‘మీతో గంట గడపడానికి ఎంత ఖర్చవుతుంది? అని ఒకరు నాకు మెసేజ్ చేశారు’





