
గంటలు కాదు… రోజులు గడుస్తున్నాయి… SLBC టన్నెల్లో చిక్కుకున్న వారి ఆచూకీ మాత్రం లభించడంలేదు. టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది ఎలా ఉన్నారో….? ప్రాణాలతో ఉండొచ్చన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి. అయినా… వారంతా క్షేమంగానే ఉండొచ్చన్న చిన్న హోప్‌తో… సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే… ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్ దగ్గర పరిస్థితి చూసి రెస్క్యూ సిబ్బంది కూడా భయాందోళన చెందినట్టు తెలుస్తోంది. అయినా… ఆశ వదులుకోకుండా… రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
SLBC టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రభుత్వం కూడా విశ్వప్రయత్నం చేస్తోంది. మొన్న (శనివారం) ఉదయం 8గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఇప్పటికి రెండు రోజులు గడిచిపోయాయి. మూడో రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంత వరకు ఆ 8 మంది జాడ లేదు. SDRF, NDRF బృందాలు… టార్చి లైట్లు వేసుకుని టన్నెల్లోకి వెళ్లారు. టీబీఎం యంత్రం వరకు వెళ్లి… టన్నెల్లో చిక్కుకుపోయిన వారి పేర్లు పెట్టి పిలిచారు. అయినా… ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లే మార్గం… చాలా భీతావహంగా ఉంది. ఎటు చూసినా చిమ్మ చీకటి.. కిలోమీటరు దూరం వరకు బురద పేరుకుపోయి ఉంది.
అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. అంతేకాదు… పనిముట్లు, ఇనుపరాడ్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. వీటిని తొలగిస్తే.. మళ్లీ పైకప్పు కూలే ప్రమాదం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో… ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉంది. ఆర్మీ, నేవీ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటోంది. ఎలాగైన 8 మంది జాడ కనుగొనేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. సొంగంలోకి పెద్ద పెద్ద మోటర్లు పెట్టి నీటిని తోడే ప్రయత్నం చేస్తున్నాయి.. నేవీ బృందాలు. అలాగే.. మట్టిని తొలగించే పనిలో NDRF బృందాలు నిమగ్నమయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. చిన్న అవకాశాన్ని కూడా వదలుకోవడం లేదు. చివరికి… ర్యాట్ హోల్ మైనర్స్‌ను కూడా రంగంలోకి దింపింది. నిన్న (ఆదివారం) ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్ వచ్చారు. 2023వ సంవత్సరంలో ఉత్తరాఖండ్‌లోని సిల్కియారా సొరంగంలో చిక్కుకున్న కార్మికులను కాపాడటంతో… ఈ ర్యాట్ హోల్ మైనర్స్ విజయం సాధించారు. 2023లో సిల్కియారా సొరంగంలో… 41 మంది కార్మికులు చిక్కుకుపోయారు. 17 రోజులు ప్రయత్నించినా అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ర్యాట్ హోల్ మైనర్లు ఒక్క రోజులోనే.. వారి జాడ కనుగొని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సహకరించారు. అయితే… అక్కడి పరిస్థితి వేరు… ప్రస్తుత పరిస్థితి వేరు.
టన్నెల్ దగ్గర సహాయక చర్యలను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరిస్తున్నారు. పరిస్థితికి తగ్గట్టు.. సహాయక చర్యల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలో నిపుణులతో చర్చిస్తున్నారు. ఈ ప్రయత్నాలు ఫలించాలని… టన్నెల్లో చిక్కుకున్న వారు క్షేమంగా.. ప్రాణాలతో బయటపడాలని… కోరుకుందాం.
ఇవి కూడా చదవండి..
-
రంగములోకి దిగిన రాట్ హోల్ మైనర్స్… ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్
-
50 గంటలైనా కనిపించని జాడ.. 8 మంది కార్మికులు టన్నెల్ సమాధే?
-
యూట్యూబ్ ఛానల్ ముసుగులో ‘స్పా’ సెంటర్ నిర్వహణ..?
-
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిందే… మాజీ మంత్రి కేటీఆర్