
IndiGo: ఇండిగో విమాన సర్వీసుల్లో దాదాపు వారం రోజులుగా కొనసాగుతున్న తీవ్ర అంతరాయాలు దేశవ్యాప్తంగా వేలాది మంది ప్రయాణికులను ఇబ్బంది పెట్టాయి. షెడ్యూల్ ప్రకారం బయలుదేరాల్సిన అనేక విమానాలు రద్దు కావడంతో పాటు, గంటల తరబడి ఆలస్యాలు రావడం వల్ల ప్రయాణికుల ప్రయాణ ప్రణాళికలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ సమస్యలు పెద్దఎత్తున వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం నేరుగా దృష్టి సారించింది. ప్రయాణికులు నష్టపోకూడదనే ఉద్దేశంతో రద్దయిన టిక్కెట్ల మొత్తాన్ని వెంటనే రీఫండ్ చేయాలని సంస్థకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఇండిగో సంస్థ ఇప్పటికే రూ.610 కోట్ల మేర రీఫండ్‌లు ప్రాసెస్ చేసినట్టు పౌర విమానయాన శాఖ వెల్లడించింది. టిక్కెట్లతో పాటు సుమారు 3000 సూట్‌కేసులు, ప్రయాణికుల వ్యక్తిగత సామగ్రి, ఇతర లగేజీ కూడా తిరిగి అందజేయబడిందని వివరించింది. అనుకోని ఈ వ్యవస్థాపక అంతరాయాల వల్ల లగేజీ వేల సంఖ్యలో పోయి, వివిధ విమానాశ్రయాల్లో పేరుకుపోయిన విషయం తెలిసిందే. వాటిని గుర్తించి యజమానులకు తిరిగిచ్చేందుకు ప్రత్యేక టీమ్‌లు పనిచేశాయి.
ఇండిగో కార్యకలాపాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురానికై సంస్థ వేగంగా చర్యలు చేపట్టింది. సాధారణంగా ఆదివారాలలో సగటున రోజుకు 2300 విమానాలను నడిపే ఇండిగో, ప్రస్తుతం పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 1500 ఫ్లైట్ సర్వీసులను నిర్వహించడానికి ప్రణాళిక చేపట్టింది. రాబోయే డిసెంబర్ 10 నాటికి మొత్తం నెట్‌వర్క్‌ను పూర్తిస్థాయిలో స్థిరీకరించగలమని సంస్థ అంచనా వేస్తోంది. సమయపాలన కూడా కొంత మేర మెరుగుపడుతుందని, త్వరలో 75 శాతం సమయపాలన మార్కును చేరుకుంటామని సంస్థ సీఈఓ పీటర్ ఎల్బర్స్ ఉద్యోగులకు పంపిన అంతర్గత సమాచారంలో పేర్కొన్నారు.
ఇక విమాన రద్దు, సేవల అంతరాయాలు అధికంగా ఉండటంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థను ప్రశ్నించడం ప్రారంభించింది. ఇండిగో సీఈఓతో పాటు అకౌంటబుల్ మేనేజర్ ఇసిడ్రో పోర్కేరాస్‌కు కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసి వివరణ కోరింది. ఇదే సమయంలో ఇండిగో నిర్వహణ వైఫల్యం, పౌర విమానయాన శాఖ సరిగా పర్యవేక్షించకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరం తీవ్ర విమర్శలు చేశారు.
విమానాలు రద్దు కావడంతో అనేక మార్గాల్లో ప్రయాణికులు చిక్కుకుపోవడంతో రైల్వే శాఖ ముందుకు వచ్చింది. రద్దీ ఎక్కువగా ఉన్న మార్గాల్లో అదనపు ప్రత్యేక రైళ్లు నడుపుతూ ప్రయాణికులకు ప్రత్యామ్నాయం కల్పించింది. ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి త్వరలో మరిన్ని ప్రత్యేక సర్వీసులు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే అధికారులు వెల్లడించారు. ఈ చర్యతో కనీసం అత్యవసర ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగింది. మొత్తంగా వీలైనంత త్వరగా పరిస్థితి సాధారణ స్థితికి చేరుతుందని ప్రభుత్వం నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది.





