
ఎల్బీనగర్, క్రైమ్ మిర్రర్:-తాను చేస్తున్న సేవలను నిరంతరం కొనసాగిస్తానని శ్రీశైలంలోని అఖిల భారత భక్త మార్కండేయ పద్మశాలీయుల నిత్యాన్నదాన సత్రం అధ్యక్షులు, సంఘ సేవకులు వర్కాల సూర్యనారాయణ అన్నారు. గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న వారిని ఘనంగా సన్మానించారు. ఇందులో భాగంగా వర్కాల సూర్యనారాయణను గ్లోబల్ బిజినెస్ నెట్వర్క్ నిర్వాహకులు కడారి శ్రీధర్ తదితరులు శాలువతో సత్కరించి షీల్డును బహూకరించారు. ఈ సందర్భంగా వర్కాల సూర్యనారాయణ మాట్లాడుతూ శ్రీశైలంలో పద్మశాలి నిత్యాన్నదాన సత్రం ద్వారా, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా విశేష సేవలందిస్తున్నామని తెలిపారు. తమ సేవలను గుర్తించి పలు సంస్థలు తమను అవార్డులతో సత్కరించారని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని తెలిపారు.