తెలంగాణ

చురుగ్గా రుతు పవనాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

Weather Report: నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. హైదరాబాద్‌లో ఉరుములు, మెరుపులతో వాన పడింది. పలుప్రాంతాలు జలమయం అయ్యాయి. వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

5 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వానలు

అటు ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, మెదక్‌, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరో ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తారు వర్షాలు పడుతాయని తెలిపింది. ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లోఅలర్ట్‌ జారీ చేసింది.

ఆ ప్రాంతాల్లో రుతుపవనాల కదలికలో జాప్యం

అటు వచ్చే మూడు రోజులలో విదర్భ, చత్తీస్‌ గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత మూడు రోజుల్లో గుజరాత్‌, బెంగాల్‌, జార్ఖండ్‌, బిహార్‌ లోని పలు ప్రాంతాలకు విస్తరిస్తాయని వివరించింది. మరోవైపు తెలంగాణ, రాయలసీమ, కర్ణాటక పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వివరించింది. కర్ణాటక నుంచి తెలంగాణ, చత్తీస్‌ గఢ్ మీదుగా ఒడిశా వరకూ ఉపరితలద్రోణి విస్తరించినట్లు తెలిపింది. వీటి ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వర్షాలు పడతాయని తెలిపింది.  శని, ఆదివారాల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీరం వెంబడి బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదన్నారు.

Read Also: కాళేశ్వరం ఈఈ ఇంట్లో కళ్లు చెదిరే ఆస్తులు, విలువ ఎన్ని కోట్లంటే?

Back to top button