అంతర్జాతీయం

రష్యా ఇంధనం కొనొద్దన్న అమెరికా.. హెచ్చరికలను పట్టించుకోమన్న మాస్కో!

రష్యా నుంచి ఆయిల్ ను కొనుగోలు చేసే దేశాలపై 500 శాతం సుంకాలను విధిస్తామని అమెరికా మరోసారి హెచ్చరించింది. రష్యా నుంచి చైనా, భారత్, బ్రెజిల్, ఇతర దేశాలు  తక్కువ ధరకే ఆయిల్, గ్యాస్‌ కొనుగోలు చేస్తున్నాయి. ఈ దేశాలను ఉద్దేశించి ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. రష్యాకు సహాయం చేసే దేశాలపై 500 శాతం వరకూ సుంకాలు విధిస్తామని ట్రంప్ వెల్లడించారు. రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధాన్ని ముగించడానికి చివరి అవకాశం చైనా, భారత్, బ్రెజిల్‌ లాంటి దేశాలపై సుంకాలు విధించడమేనన్నారు. రాబోయే 50 రోజుల్లో శాంతి ఒప్పందం కుదరకపోతే రష్యాపై 100 శాతం సుంకాలను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు.

అమెరికా హెచ్చరికలను పట్టించుకోమన్న రష్యా

అటు ఉక్రెయిన్‌ తో యుద్ధాన్ని ముగించేందుకు 50 రోజుల్లో ఒప్పందం కుదుర్చుకోకపోతే  భారీగా టారిఫ్‌లు విధిస్తానంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలు రష్యా తోసిపుచ్చింది. ఎలాంటి ఆంక్షలు విధించినా, తాము ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని తేల్చి చెప్పింది.  ఈమేరకు రష్యా విదేశాంగశాఖ మంత్రి సెర్గెయ్‌ లావ్రోవ్‌ కీలక ప్రకటన చేశారు. రష్యాపై ఇప్పటికే పలు ఆంక్షలు అమలులో ఉన్నాయని, కొత్తవి పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉక్రెయిన్‌ యుద్ధం పరిష్కారానికి 50 రోజుల సమయం ఇవ్వడం వెనుక ట్రంప్‌ ఉద్దేశం ఏంటో తమకు తెలుసుకోవాలనుందన్నారు. గతంలోనూ 24 గంటలు, 100 రోజులు గడువులు ఇచ్చారని గుర్తు చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి సంబంధించి ట్రంప్ వ్యవహార శైలిపై రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

రష్యా తీరుపై ట్రంప్ విమర్శలు

అటు ఉక్రెయిన్‌ తో యుద్ధానికి సంబంధించి రష్యా వైఖరి సరిగా లేదని ఇప్పటికే పలుమార్లు ట్రంప్ మడిపడ్డారు. తాజాగా నాటో సెక్రటరీ జనరల్‌ మార్క్‌ తో సమావేశం సందర్భంగా.. పుతిన్‌పై విమర్శలు గుప్పించారు. ఆయన తీరు తీవ్ర అసంతృప్తికి గురిచేసిందన్నారు.  పుతిన్‌ పగలు అందంగా మాట్లాడి, రాత్రి ప్రజల మీద బాంబులు విసురుతాడని మండిపడ్డారు. ఆయన ప్రవర్తన  తనకు నచ్చడం లేదన్నారు.

Read Also: భారత్- అమెరికా వాణిజ్య చర్చలు.. వాషింగ్టన్ కు ఇండియా టీమ్!

Back to top button