
తెలంగాణ రాష్ట్రంలో పేద మహిళలకు అండగా నిలిచే మరో కీలక సంక్షేమ కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతం చేసింది. అర్హులైన ప్రతి పేద మహిళకు ఇందిరమ్మ చీరలు అందించడమే లక్ష్యంగా పంపిణీ ప్రక్రియను మరింత వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చీరలు అందని దాదాపు 15 లక్షల మంది మహిళలకు సంక్రాంతి పండుగలోపు పంపిణీ పూర్తి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను స్పష్టంగా ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరలను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 50 లక్షల మందికి పైగా మహిళలకు చీరలు అందించినట్లు మంత్రి తెలిపారు. మధ్యలో పంచాయతీ ఎన్నికల కారణంగా పంపిణీ ప్రక్రియ కొంతకాలం నిలిచిపోయినప్పటికీ, ఎన్నికల అనంతరం మళ్లీ పూర్తి స్థాయిలో ప్రారంభించినట్లు వెల్లడించారు. ఎక్కడా ఆలస్యం జరగకుండా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు.
అర్హులైన ప్రతి మహిళకు చీరలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొన్ని గ్రామాల్లో రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటుండగా, రేషన్ కార్డు లేని మహిళలకు ఆధార్ కార్డు ఆధారంగా చీరలు అందిస్తున్నారు. ఆధార్, రేషన్ కార్డులు రెండూ లేకపోయినా.. బిలో పావర్టీ లైన్ కిందకు వచ్చే పేద మహిళలు తమ ఓటర్ కార్డును చూపించి చీరలు పొందే వెసులుబాటు కల్పించారు. సదరు గ్రామానికి చెందిన మహిళగా గుర్తింపు ఉండి అర్హత ఉంటే సరిపోతుందని, సాంకేతిక కారణాలతో ఎవరూ చీరల నుంచి వంచితులు కాకూడదని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ తుది దశకు చేరుకుంటుండటంతో, ప్రభుత్వం పట్టణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పట్టణాల్లోని సుమారు 35 లక్షల మంది మహిళలకు మార్చి 1 నుంచి ఉచిత చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి సీతక్క ప్రకటించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వార్డుల వారీగా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి చీరలను పంపిణీ చేయనున్నారు. పట్టణ మహిళలందరికీ సమానంగా లబ్ధి చేకూర్చేలా ముందస్తు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.
మహిళలను కేవలం సంక్షేమ పథకాల లబ్ధిదారులుగా మాత్రమే కాకుండా, స్వయం ఉపాధితో ఆర్థికంగా బలపడేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. ఇందుకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 250 మహిళా క్యాంటీన్లను ఏర్పాటు చేయగా, వాటి నిర్వహణకు మహిళలకు వంటలు, నిర్వహణలో ప్రత్యేక శిక్షణ అందించారు.
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం వద్ద మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక దుకాణాల ఏర్పాటు కొనసాగుతోంది. అలాగే మేడారం జాతర సందర్భంగా 500 చికెన్ షాపులు, బొంగు చికెన్ స్టాల్స్ నిర్వహించే బాధ్యతను పూర్తిగా మహిళా సంఘాలకే అప్పగించారు. ఇది మహిళలకు ఆదాయ మార్గాలు పెంచే కీలక అడుగుగా మారిందని మంత్రి అభిప్రాయపడ్డారు.
ప్రతి మండల సమాఖ్యకు సొంత బస్సులను అందించే ప్రక్రియను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజా ప్రభుత్వం మహిళా పక్షపాతంగా వ్యవహరిస్తూ సంక్షేమ పథకాలను నేరుగా క్షేత్రస్థాయికి తీసుకెళ్తోందని మంత్రి తెలిపారు. కేవలం వస్తువుల పంపిణీతోనే పరిమితం కాకుండా, బ్యాంకు రుణాల సహకారంతో మహిళా సంఘాలు స్వయంగా వ్యాపారాలు చేసుకునేలా ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు.
ALSO READ: గంజాయి మత్తులో వీరంగం.. ఇద్దరు మహిళలపై దారుణం (VIDEO)





