తెలంగాణ

హైదరాబాద్ లోకుండపోత, జనజీవనం అస్తవ్యవస్థం!

Hyderabad Rain: హైదరాబాద్‌ లో వాన దంచికొట్టేసింది. భారీ వర్షానికి  హైదరాబాద్, సికింద్రాబాద్‌  జనం విలవిల్లాడారు. శుక్రవారం సాయంత్రం నుంచి పలు ప్రాంతాల్లో జోరుగా వర్షం కురిసింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌ లో వరుణుడు బీభత్సం సృష్టించాడు. గచ్చిబౌలి, హైటెక్ సిటీ, కూకట్ పల్లి, ఎస్సార్ నగర్, అమీర్ పేట, పంజాగుట్ట ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వాహనదారులు, ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శేరిలింగంపల్లి, ఖైరతాబాద్‌, కంటోన్మెంట్‌, హకీంపేటలోనూ భారీ వర్షం కురిసింది. ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. డ్రేనేజీలు పొంగిపొర్లాయి. వరద ప్రవాహం రోడ్ల మీదికి వచ్చింది. పలు ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.  రాజేంద్రనగర్‌, చేవేళ్ల, ఇబ్రహీంపట్నం పరిధిలో వర్షం తీవ్రత ఎక్కువగా ఉంది. ఉరుములు, మెరుపులతో కుండపోత వాన పడింది. వాన తీవ్రతకు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఆగిపోయింది.

ఇక మెట్రోస్టేషన్లు, బస్సు స్టాప్‌ల పక్కనే వర్షపు నీరు నిలిచిపోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పాతబస్తీలో పరిస్తితి దారుణంగా ఉంది. డ్రైనేజీలు నిండి రోడ్ల మీద మోకాలు లోతు నీటి ప్రవాహాలు దర్శనం ఇచ్చాయి. రోడ్లన్నీ చెరువులను తలపించాయి. హైదరాబాద్ అంతా వర్షాల ధాటికి అతలాకుతలం అయ్యింది. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్థంగా మారింది.

అధికారుల కీలక హెచ్చరికలు

భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు  జీహెచ్‌ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్‌ఎఫ్, కంటోన్మెంట్‌ బోర్డు సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. హైడ్రా సిబ్బంది బాధితులను పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పోలీసులు ఆయా ప్రాంతాల్లో వరద నీటిని క్లియర్ చేసే పనిలో పడ్డారు. అత్యవసర బృందాలు రోడ్ల మీద నీటిని ఆగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు అత్యవసరమైతే సహాయక చర్యలు తీసుకుంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.

సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

హైదరాబాద్‌ లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అలర్ట్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, వాటర్‌ వర్క్స్, విద్యుత్, పోలీసు, ఎస్డీఆర్‌ఎఫ్, హైడ్రా బృందాలు సమన్వయంతో పని చేయాలన్నారు. ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

Read Also: ఓఆర్‌ఆర్‌పై భారీ వర్షం, జలపాతాన్ని తలపించిన ఔటర్‌

Back to top button