
క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ :-రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని యాచారం, ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దేవాలయాలపై దాడులు జరిపి విగ్రహాలు, ఇతర విలువైన వస్తువులు చోరీ చేసిన ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.ఏపీకి చెందిన శివానంద్, షరీఫ్ అనే ఇద్దరు వ్యక్తులు దేవాలయాల్లో పంచలోహ విగ్రహాలు, నగలపై కన్నేసి దొంగతనాలకు పాల్పడుతూ పట్టుబడ్డారని రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు ఎల్బీనగర్ క్యాంప్ కార్యాలయంలో వెల్లడించారు. ఉప్పల్ లో ఒక బైక్ ను కూడా దొంగిలించి, అదే వాహనంపై తిరుగుతూ మద్యం మత్తులో నేరాలు చేసేవారని తెలిపారు.
దేవాలయాల నుంచి చోరీ చేసిన విగ్రహాలను ఉప్పల్ కు చెందిన క్రాంతి కుమార్ కు అమ్ముతున్నట్టు విచారణలో తేలిందని, అతనిని కూడా అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. ఈ ముఠా సీసీటీవీలు లేని దేవాలయాలనే లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుందని, “ప్రతి దేవాలయంలో సీసీటీవీలు ఏర్పాటు చేసుకోవడం తప్పనిసరి” అని సుదీర్ బాబు సూచించారు.
నిందితుల వద్ద నుంచి 61 కేజీల బరువైన విగ్రహాలు, దాదాపు రూ.5 లక్షల విలువైన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంలో మహేశ్వరం డీసీపీ సునీత రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కె.వి.రాజు, ఇబ్రహీంపట్నం ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.