
రామకృష్ణాపూర్,(క్రైమ్ మిర్రర్):- ట్రేడ్ మార్కెట్‌లో డబ్బులు జమ చేస్తే తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని నమ్మించి 11 మందిని మోసం చేసి రూ.22 లక్షల నగదు కాజేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు,బాధితులు తెలిపిన వివరాల మేరకు రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దెరగాడి ఏరియాకు చెందిన అంబడిపెల్లి దామోదర్ (45) తనను తాను “షేర్ మార్కెట్ బ్రోకర్”గా పరిచయం చేసుకుంటూ, ఫీస్ డాటా ట్రెండింగ్ గ్రూప్‌కు సంబంధించిన డీఎస్ఆర్ గ్రూప్ ఆఫ్ ఫైనాన్స్ అనే సంస్థలో పెట్టుబడి పెడితే ప్రతినెల డ్రా ద్వారా అధిక లాభాలు వస్తాయని నమ్మించాడు. ఈ క్రమంలో మంచిర్యాల జిల్లా పరిధిలోని రామకృష్ణాపూర్, బెల్లంపల్లి, మంచిర్యాల, మందమర్రి మండలాలకు చెందిన 11 మందిని ఆకర్షించి ఒక్కొక్కరి నుంచి రూ.2 లక్షల చొప్పున మొత్తం రూ.22 లక్షలు అతనికి అప్పగించారు.డబ్బులు తీసుకున్న తర్వాత నిందితుడు డ్రా నిర్వహించకుండా కాలయాపన చేస్తూ వచ్చాడు.
Read also : చైనీస్ మాంజా ప్రజల ప్రాణాలకే కాదు పర్యావరణానికి కూడా ముప్పే : సజ్జనార్
తమ సొమ్ము తిరిగి ఇవ్వాలని బాధితులు కోరగా గత ఏడాది నవంబర్ నుంచి దామోదర్ తప్పించుకుని తిరుగుతున్నాడని బాధితులు తెలిపారు. ఇటీవల డబ్బుల కోసం నిలదీయగా మీకు డబ్బులు ఇవ్వను, ఏమి చేసుకుంటారో చేసుకోండి… అంటూ బెదిరించినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ ఘటనపై బాధితుల్లో ఒకరైన రాసాకొండ శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామకృష్ణాపూర్ పట్టణ ఎస్సై భూమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్సై భూమేష్ మాట్లాడుతూ,సులభమైన మార్గాల్లో తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయని ఆశ చూపించే గుర్తుతెలియని కంపెనీలు, పరిచయం లేని వ్యక్తులను ప్రజలు నమ్మవద్దని. ఎవరైనా అధిక లాభాల పేరుతో డబ్బులు వసూలు చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని . అటువంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.
Read also : BIG ALERT: బంగాళఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు





