అంతర్జాతీయం

మోడీ, పుతిన్ సమావేశం.. ఆర్థిక, వాణిజ్య రంగాలపై కీలక చర్చలు!

Modi-Putin Meet: చైనాలోని టియాంజిన్ వేదికగా ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశం అయ్యారు. క్లిష్ట సమయాల్లో భారత్, రష్యా కలిసి నడిచాయని, ఇరుదేశాల సంబంధాలు ప్రపంచశాంతికి కీలమన్నారు ప్రధాని మోడీ. డిసెంబర్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ రాకకోసం 140 కోట్ల మంది భారతీయులు ఎంతగానో ఎదురుచూస్తున్నారని వెల్లడించారు. ఈ సందర్భంగా  ఆర్థిక, వాణిజ్య, ఇంధన రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించే దిశగా ఇరు నేతలు చర్చలు జరిపారు. ఈ చర్చలపై మోడీ, పుతిన్‌ స్పందనను వెల్లడిస్తూ ఇరుదేశాలు అధికారిక ప్రకటనలు విడుదల చేశాయి.

భారత్-రష్యా స్నేహం రాజకీయాలకు అతీతమైనది!

ఉక్రెయిన్‌ లో శాంతిస్థాపన కోసం జరుగుతున్న ప్రయత్నాలను భారత్‌ స్వాగతిస్తుందని ప్రధాని మోడీ వెల్లడించారు.  ఘర్షణల నివారణ జరగాలని యావత్‌ మానవాళి కోరుకుంటున్నదన్నారు. శాంతియుత పరిస్థితులు చిరకాలంపాటు నిలిచి ఉండేలా అన్ని భాగస్వామ్యపక్షాలు నిర్మాణాత్మక అడుగులు వేయాలన్నారు. రష్యా-భారత్‌ దశాబ్దాలుగా పరస్పర విశ్వాసంతో కూడిన స్నేహాన్ని కొనసాగిస్తున్నాయని, భవిష్యత్‌ సంబంధాలు ఇలాగే కొనసాగుతాయన్నారు. ఇరుదేశాల స్నేహం రాజకీయాలకు అతీతమైనదన్నారు. రష్యా-భారత్‌ సహకారం కొనసాగుతోందన్నారు. ఇరుదేశాల మధ్య పర్యాటకుల సంఖ్య కూడా పెరుగుతోందన్నారు. అంతర్జాతీయ వేదికలపై అత్యంత సమన్వయంతో వ్యవహరిస్తున్నామమోడీ చెప్పుకొచ్చారు.  అంతకు ముందు మోడీ, పుతిన్ కలిసి ఒకే వాహనంలో SCO మీటింగ్ కు వచ్చారు.

Back to top button