
Elections: జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలోని తిమ్మయ్యపల్లెలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు ఊహించని మలుపు తిరిగాయి. సాధారణంగా గ్రామీణ ఎన్నికల్లో బంధుత్వాలు, సంబంధాలు కీలకంగా మారుతుంటాయి. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఒకే ఇంటికి చెందిన తల్లి, కూతురు పరస్పరం బరిలో నిలవడంతో గ్రామవ్యాప్తంగా ఎన్నికల ఉత్కంఠ మరింతగా పెరిగింది. బీసీ మహిళలకు రిజర్వేషన్ వచ్చిన ఈ సర్పంచ్ స్థానానికి తల్లి శివరాత్రి గంగవ్వ ముందుగా పోటీ అభ్యర్థిత్వం ప్రకటించగా, కొద్ది గంటల్లోనే ఆమె స్వంత కూతురు సుమలత కూడా నామినేషన్ దాఖలు చేయడం గ్రామంలో చర్చనీయాంశమైంది.
ఈ ఎన్నికల పోటీ వెనక కుటుంబ విభేధాల ప్రభావం కూడా బలంగా కనిపించింది. సుమలత అదే గ్రామానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో తల్లీకూతురు మధ్య విభేదాలు ఏర్పడి కుటుంబాల మధ్య వైరం నెలకొంది. రాజకీయంగా కూడా పరిస్థితి ఆసక్తికరంగా మారింది. తల్లి గంగవ్వకు బీఆర్ఎస్ మద్దతు లభించగా, కూతురు సుమలతకు అధికార కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచింది. ఈ నేపథ్యంలో గ్రామంలో రెండు వర్గాలు స్పష్టంగా ఏర్పడి, ప్రచారం వేడెక్కింది.
ఇద్దరూ ఇంటింటికీ తిరిగి మద్దతు కోరారు. ప్రతి ఓటు తమ భవిష్యత్తును నిర్ణయిస్తుందనే స్పష్టతతో ప్రచారం సాగింది. ఎన్నికల రోజున గ్రామస్తులు భారీగా పోలింగ్‌కి హాజరై తమ ఓటు హక్కును వినియోగించారు. చివరకు వెలువడిన ఫలితాల్లో కూతురు సుమలత స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించింది. తల్లి గంగవ్వపై 91 ఓట్ల తేడాతో గెలిచి గ్రామ సర్పంచ్ పదవిని దక్కించుకుంది.
తల్లీకూతురు పోటీ గ్రామస్థుల్లో విభిన్న భావోద్వేగాలను రేకెత్తించింది. ఒక ఇంటి నుండి వచ్చిన ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నిక ఉత్కంఠగా మారగా, చివరకు ప్రజలు తమ అభిప్రాయాన్ని ఓట్ల రూపంలో వెల్లడించారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా, సామాజికంగా ప్రత్యేకతతో నిలిచిన ఈ ఎన్నిక ప్రస్తుతం జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: Vastu Precautions: వామ్మొ!.. ఆ రోజు తులసి మొక్కను ముట్టుకుంటే దరిద్రులవడం ఖాయమట!





