
President Murmu- Supreme Court: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో కీలక విచారణ జరగబోతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రపతి లేవనెత్తిన సందేహాలపై విచారణ జరగనుంది. ఇందుకోసం ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు అయ్యింది.
ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?
అసెంబ్లీలు తీర్మానించిన బిల్లులను నిర్ణీత వ్యవధిలో ఆమోదించాలంటూ కోర్టులు రాష్ట్రపతికి గడువు విధించగలవా? అనే సందేహం రాష్ట్రరపతి ద్రౌపది ముర్ముకు వచ్చింది. ఈ సందేహాలపై సుప్రీంకోర్టు ఈ నెల 22న విచారణ జరపనుంది. ఇందుకోసం అయిదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటయింది. ఈ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రంనాథ్, జస్టిస్ నరసింహ, జస్టిస్ అతుల్ చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు.
ఆ అధికారం సుప్రీం కోర్టుకు ఉందా?
రాష్ట్ర అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఆమోదం కోసం రాష్ట్రపతికి పంపినప్పుడు వాటిపై మూడు నెలల్లోగా నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉందని ఏప్రిల్ 8న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తమిళనాడు గవర్నర్ బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారన్న ఆరోపణలపై దాఖలైన కేసులో ఈ ఆదేశాలు ఇచ్చింది. అయితే న్యాయస్థానాలు రాష్ట్రపతికి ఈ విధంగా గడువు విధిస్తాయా? అనే సమస్య తలెత్తింది. ఈ నేపథ్యంలో రాష్ట్రపతి ముర్ము రాజ్యాంగంలోని ఆర్టికల్ 143(1) ప్రకారం ఈ సందేహాలు తీర్చాలని కోరుతూ సుప్రీంకోర్టుకు లేఖ రాశారు. జులై 22న పంపిన ‘ప్రెసిడెన్షియల్ రిఫరెన్స్’లో 14 కీలకమైన ప్రశ్నలను ప్రస్తావించారు. వాటిపై అభిప్రాయాలు చెప్పాలని కోరారు. ఈ నేపథ్యంలో సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం రాష్ట్రపతి సందేహాలను నివృత్తి చేయనుంది.
Read Also: క్రైస్తవుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు, సీఎం కీలక నిర్ణయం!